CM YS Jagan: విద్యార్థులు, టీచర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. తక్షణమే వారికి ట్యాబ్‌ల పంపిణీకి ఆదేశాలు
నాడు-నేడు కింద పనుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.1,120 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు వెంటనే పంపిణీ చేయాలని అధికారుల్ని సూచించారు.
విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థులు, టీచర్లకు కలిసి సుమారు 5 లక్షలకు పైగా ట్యాబ్ లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, సాధించిన ప్రగతిని విద్యాశాఖ అధికారులు వివరించారు. నాడు-నేడు కింద పనుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.1,120 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు వెంటనే పంపిణీ చేయాలని అధికారుల్ని సూచించారు. ప్రస్తుతం లక్షన్నరకు పైగా ట్యాబ్ లు అందుబాటులో ఉన్నాయని, అందులో కంటెంట్‌ను వెంటనే లోడ్ చేయాలని జగన్ ఆదేశించారు. కాగా 8వ తరగతి విద్యార్థులు, టీచర్లకు కలిపి మొత్తంగా 5,18,740 ట్యాబ్‌లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ముందుగా టీచర్లకు ట్యాబ్‌లను అందజేయనున్నారు. అందులో వారికి కంటెంట్‌పై అవగాహన కల్పించిన తర్వాత విద్యార్థులకు ట్యాబ్స్అందజేస్తామని అధికారులు తెలిపారు. అ వచ్చే ఏడాది స్కూళ్లు తెర్చినాటికి విద్యాకానుక కిట్లను ఏప్రిల్ నాటికే సిద్ధం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. పిల్లలకు ఇచ్చే యూనిఫారం క్లాత్ సైజును పెంచే ప్రతిపాదనకు, స్టిచ్చింగ్ ధరలు పెంచేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం జతకు రూ.40 ఇస్తుండగా, ఇకపై రూ. 50 ప్రభుత్వం ఇవ్వనుంది. స్కూల్ బ్యాగ్ సైజ్ లలోనూ ప్రభుత్వం మార్పులు చేయనుంది.
స్కూళ్ల మెరుగైన నిర్వహణకు..
ఇక 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకూ మీడియం సైజు స్కూలు బ్యాగులు.. 6 నుంచి 10వ తరగతి వరకూ పెద్ద సైజ్ బ్యాగులను అందించనున్నారు. ఈ బ్యాగుల నాణ్యతను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థను థర్డ్ పార్టీగా పెడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో స్కూళ్లను మరింత మెరుగ్గా నిర్వహించడానికి సరికొత్త కొత్త విధానాన్ని కూడా తీసుకురావాలని సర్కారు నిర్ణయించింది. మండల విద్యాశాఖ అధికారితో పాటు మరో అధికారిని ప్రత్యేకంగా నియమించనున్నారు. సెర్ఫ్‌లో పని చేస్తున్న అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లకు నాన్ అకడమిక్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తున్నారు. ఈ కొత్త విధానం అక్టోబర్ 17 తేదీ నుంచే అమల్లోకి రానుంది.
కాగా ఇదే సమావేశంలో ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలపై మండిపడ్డారు జగన్. విద్యా సంబంధిత కార్యక్రమాలు, మంచి చేసే నిర్ణయాలను కూడా రాజకీయాల్లోకి లాగడం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. స్కూలు పిల్లలను కూడా రాజకీయాలను నుంచి మినహాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..