Srikakulam: చెక్‌పోస్ట్ వద్ద ఆగిన కారులో కనిపించిన పంజరం.. ఏంటా అని వెళ్లి చూడగా..
శ్రీకాకుళం జిల్లాలో విదేశీ కోతుల్ని అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. టెక్కలి సబ్ డివిజన్ అటవీశాఖాధికారి నాగేంద్రరావు, కాశీబుగ్గ రేంజ్ అధికారి మురళీకృష్ణ, సిబ్బంది తనిఖీలు చేయగా ఓ కారులో అరుదైన కోతులను గుర్తించారు. దక్షిణాఫ్రికాలోని ఉగాండా అటవీ జాతి సంతతికి చెందిన 2 అరుదైన ఎల్ హోస్ట్ ఆడ మగ కోతులుగా గుర్తించారు.

అరుదైన వన్యప్రాణుల్ని ప్రశాంతంగా బతకనివ్వడం లేదు క్రూరులు. ఏనుగులు, పెద్ద పులులు, దుప్పులు వంటి వాటిని చంపి.. వాటి దంతాలు, చర్మాలు, గోర్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అరుదైన నక్షత్ర తాబేళ్లు, రెండు తలల పాములు వంటి వాటిని కనిపిస్తే.. కలిసి వస్తుందని మూఢ నమ్మకాలతో ఇళ్లలో బంధిస్తున్నారు. ఇంకొన్ని అరుదైన జాతులు జీవుల్ని విమానాల్లో, రోడ్డు మార్గాల్లో బోర్డర్స్ దాటించేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో అరుదైన విదేశీ కోతుల్ని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు స్వాధీనం చేసుకున్నారు. 2 విదేశీ కోతుల్ని అక్రమ రవాణా చేస్తున్న ముఖేష్‌రామ్, సౌరభ్ మండల్, ధనుంజయ్ సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. కోతుల్ని అస్సాం నుంచి కోల్‌కతా మీదుగా చెన్నైకు తరలిస్తున్నట్లు అటవీశాఖ సిబ్బంది తెలిపారు.
కారులో కోతుల్ని తరలిస్తుండగా.. ఇచ్ఛాపురం చెక్ పోస్టు దగ్గర శ్రీకాకుళం అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేయగా కోతులను గుర్తించారు. వాటి గురించి ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో.. ముగ్గురిని అదుపులోకి తీసుకుని.. ఇచ్ఛాపురం కోర్టుకు తరలించారు. కారును సీజ్ చేసి, కోతులను జంతు వైద్యుల సంరక్షణలో ఉంచారు.
కాగా స్వాధీనం చేసుకున్న కోతులు దక్షిణాఫ్రికాలోని ఉగాండా అటవీ జాతి సంతతికి చెందినవిగా చెబుతున్నారు. అవి 2 అరుదైన ఎల్ హోస్ట్ ఆడ, మగ కోతులుగా నిర్ధారించారు. ఈ కోతులు కాశీబుగ్గ అటవీశాఖ రేంజ్ కార్యాలయంలో ఉంచారు. వాటిని తరలించేందుకు యత్నించిన వారిపై వన్య ప్రాణుల సంరక్షణ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామంటున్నారు. ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత ఆ కోతుల్ని ఏం చేయాలన్న అంశంపై స్పష్టత ఇస్తామని ఫారెస్ట్ సిబ్బంది తెలిపారు.

Rare Monkeys
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




