Prakasam District: ఎన్ని కరువు కాటకాలు వచ్చినా ఈ బావి మాత్రం ఎండిపోదు..
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండంచర్ల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న 13వ శతాబ్దం లో కాటమరాజు తవ్వించిన బావి ఇప్పటికీ ప్రజలు, పశుసంపదకు తాగునీరు అందిస్తోంది. దీని చరిత్ర గురించి గ్రామస్థులు చెబుతున్న విషయాలు ఆశ్యర్యానికి గురి చేస్తున్నాయి ...

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండంచర్ల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో 13వ శతాబ్దంలో కాటమరాజు తవ్వించిన బావి నేటికీ ప్రజలు, జీవాలకు తాగునీరందిస్తోంది. కనిగిరిని పాలించిన కాటమరాజు, నెల్లూరు రాజైన మనుమసిద్ధి కుమారుడు నల్లసిద్ధి మధ్య జరిగిన యుద్ధంలో అపారమైన గోసంపదను కాటమరాజు కోల్పోయి నల్లమల ప్రాంతంలో ఆశ్రయం పొందారు. ఆ సమయంలో తవ్వించిన ఈ బావి ఎప్పటికీ ఎండకపోవడం విశేషం. అప్పటి నుంచి పశ్చిమ ప్రకాశం ప్రజలు పశుసంపదను కాపాడాలని, పాడిని వృద్ధి చేయాలని కోరుతూ కాటమరాజుకు ఏటా మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కాటమరాజుస్వామి ఆలయ తిరునాళ్లకు ఏటా వేలాది మంది భక్తులు పాల్గొంటారు. పరిసర ప్రాంత భక్తులే కాకుండా… ఇతర జిల్లాల నుంచి ప్రజలు తండోపతండా లుగా వచ్చి పాల్గొనడం విశేషం.
చిలకలు, పశువుల కారణంగా యుద్ధం… పశువుల కోసం అడవిలో బావి ఏర్పాటు.
13వ శతాబ్దంలో అప్పటి కనిగిరి ప్రాంతాన్ని పరిపాలించిన కాటమరాజు, నెల్లూరు ప్రాంతాన్ని నల్లసిద్ధి రాజు పరిపాలిస్తుండగా ఓ యుద్దం జరిగింది. ఆ సమయంలో కరువు తాండవిస్తుండటంతో పశువులకు తాగునీరు లేక చలమల దగ్గరకు వస్తుండటంతో అక్కడ ఉన్న చిలకల గుంపు అరుపులకు అవి బెదిరి నీటిని తాగేందుకు ఇబ్బంది పడ్డాయట. చిలకల అరుపులకు ఆవులు బెదరుతున్నాయని కాటమరాజు మంత్రి చిలుకలను చంపించడం, అందులో నల్ల సిద్ధి భార్య కుందుమాదేవి పెంపుడు చిలుక ఉండటం ఆమె కోపం తెప్పించింది. దీంతో ప్రతీకారంగా రాజు భార్య ఆవులను చంపించిందట. ఈ పరిణామంతో కాటమరాజుకు, నల్లసిద్ధికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇరువురికి అపార నష్టం కలగడంతో కాటమరాజు ఆవులను తీసుకొని నల్లమల ప్రాంతానికి తరలి వెళ్లి ఆశ్రమం ఏర్పరచుకున్నాడు. ఆ ఆశ్రమమే నేటి కాటమరాజు ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో ఆవుల కోసం ఆయన అనేక బావులను తవ్వించాడని ప్రతీతి. ఎన్ని కరపు కాటకాలు వచ్చినా ఆలయ సమీపంలో ఉన్న నీటికొలను ఎండకపోవటం విశేషంగా చెబుతారు.
