AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America: ట్రంప్ ముందు తేలిపోయిన బైడెన్‌.. అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ డిమాండ్‌

ఒక్క డిబేట్.. ఆయన కొంప అగ్రరాజ్యాధినేత ముంచిందా? మొన్న జరిగిన సంవాదంలో ట్రంప్‌ దెబ్బకు బైడెన్‌ కకావికలమై పోయారు. మాటలు తడబడి, వాదనలో తప్పటడుగులు వేశారు. అదే సొంత పార్టీలో ఆయనపై వ్యతిరేకతను పెంచింది. అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్‌ రోజు రోజుకీ  పెరుగుతోంది. ఆగస్టులో ఈ విషయం పై అటోఇటో తేలనుట్లు తెలుస్తోంది. 

America: ట్రంప్ ముందు తేలిపోయిన బైడెన్‌.. అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ డిమాండ్‌
Joe BidenImage Credit source: AP Photo / David Yeazell
Surya Kala
|

Updated on: Jul 02, 2024 | 6:58 AM

Share

మాటల్లో తడబాటు..చేతల్లో పొరపాటు…ఇదే జో బైడెన్‌కు గ్రహపాటుగా మారనుందా? అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఆయన అభ్యర్థిత్వానికి ముప్పు తేనుందా? ట్రంప్‌తో డిబేట్‌కు తలపడడం ఇప్పుడు బైడెన్‌కు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. అగ్రరాజ్యం అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, రిపబ్లికన్‌ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య కొద్ది రోజుల క్రితం వాడివేడి డిబేట్‌ జరిగింది.ట్రంప్‌ దూకుడుకు బైడెన్‌ నిలబడలేకపోయారు. అమెరికా ప్రజాస్వామ్యం, ఆర్ధిక వ్యవస్థ, అధ్యక్షుల వయస్సు వంటి అంశాలపై ఈ డిబేట్ లో ట్రంప్, బైడెన్ మధ్య హాట్ హాట్ గా చర్చ జరిగింది. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఈ మూడు అంశాల్లోనూ విఫలమయ్యారంటూ ట్రంప్ ఆరోపణలు చేశారు. దీనికి తగిన జవాబు ఇవ్వడంలో బైడెన్ తడబడ్డారు. ఇమ్మిగ్రేషన్ తో పాటు ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టడంలో బైడెన్ వైఫల్యాలను ట్రంప్ పదే పదే ప్రస్తావించి ఇరుకునపెట్టారు. ట్రంప్‌ పంచ్‌లకు తోడు…వయసుతో పాటు వచ్చిన సమస్యలతో సతమతమైపోయారు బైడెన్‌.

ముఖాముఖి చర్చలో ట్రంప్‌ ధాటికి చేతులెత్తేసిన బైడెన్‌పై, సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 81 ఏళ్ల వయసున్న ఆయన, అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. బైడెన్‌ మాత్రం…దానికి ససేమిరా అంటున్నట్లు సమాచారం. అయితే డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కమిటీ సభ్యుల్లో బైడెన్‌పై అసమ్మతి బాగా పెరిగిందని తెలుస్తోంది. బైడెన్‌ను తప్పించి యువనేతకు అవకాశమివ్వాలన్న డిమాండ్‌ తెరపైకి వస్తోంది. మరోవైపు అధ్యక్ష రేసులో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సతీమణి మిషెల్‌ ఒబామా పేరు కూడా వినిపిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేరు కూడా ఈ రేసులో మొదటి వరుసలో ఉందంటున్నారు. ఈమె భారత సంతతికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న కమలా హ్యారిస్‌‌, 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్ధిత్వం కోసం పోటీ పడి చివరి నిమిషంలో తప్పుకున్నారు. వీళ్లతో పాటు మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

అయితే బైడెన్‌ కుటుంబం ఆయనకు మద్దతుగా నిలుస్తోంది. తప్పంతా సలహాదారులదే అంటూ వాళ్ల మీదే నెట్టేసే ప్రయత్నం చేసింది. ఇక బైడెన్‌ జలుబుతో బాధ పడుతున్నారంటూ కవర్‌ చేసే ప్రయత్నం చేసింది ఆయన క్యాంప్‌. అయితే ఇవేవి డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులను సంతృప్తి పరచలేకపోతున్నాయి. అయితే ఆగ‌స్టులో జ‌రిగే డెమొక్రటిక్ నేష‌న‌ల్ క‌న్వెన్షన్‌లో బైడెన్‌ను మార్చి.. ఆ స్థానంలో మిషెల్లీ ఒబామాను రంగంలోకి దించే అవ‌కాశం ఉంద‌ంటున్నాయి పార్టీ వర్గాలు.

ఇవి కూడా చదవండి

అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసేందుకు డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధులు షికాగోలో ఆగస్టు 19-22 మధ్య భేటీ కానున్నారు. ఆ భేటీలో బైడెన్‌ అభ్యర్థిత్వంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 4 నెలల సమయం మాత్రమే ఉండగా…డెమోక్రటిక్‌ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..