Viral Video: అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్

అమెరికాలో నల్లజాతీయుల పట్ల పోలీసుల దాష్టికం మరోమారు వెలుగుచూసింది. 2020లో ‘జార్జి ఫ్లాయిడ్‌’ హత్యోదంతం మరువక ముందే అదే తరహాలోనే తాజాగా మరో దురాగతానికి పాల్పడ్డారు. ఫ్రాంక్‌ టైసన్‌ (53) అనే ఓ నల్లజాతీయుడిని కింద పడేసి, మెడపై మోకాలితో గట్టిగా నొక్కిపెట్టి, ఊపిరాడకుండా చేసి అతడి ప్రాణాలు తీశారు. ‘నాకు ఊపిరి ఆడటం లేదని' బాధితుడు మొత్తుకున్నా పోలీసులు కనికరించలేదు. దీంతో..

Viral Video: అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్
Black Man Died N Ohio
Follow us

|

Updated on: Apr 28, 2024 | 10:39 AM

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 28: అమెరికాలో నల్లజాతీయుల పట్ల పోలీసుల దాష్టికం మరోమారు వెలుగుచూసింది. 2020లో ‘జార్జి ఫ్లాయిడ్‌’ హత్యోదంతం మరువక ముందే అదే తరహాలోనే తాజాగా మరో దురాగతానికి పాల్పడ్డారు. ఫ్రాంక్‌ టైసన్‌ (53) అనే ఓ నల్లజాతీయుడిని కింద పడేసి, మెడపై మోకాలితో గట్టిగా నొక్కిపెట్టి, ఊపిరాడకుండా చేసి అతడి ప్రాణాలు తీశారు. ‘నాకు ఊపిరి ఆడటం లేదని’ బాధితుడు మొత్తుకున్నా పోలీసులు కనికరించలేదు. దీంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దారుణ ఘటన ఓహియో రాష్ట్రంలోని కాంటన్‌ నగరంలో వారం రోజుల క్రితం జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘటన ప్రపంచాన్ని మరోసారి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన బాడీ కెమెరా ఫుటేజ్‌ను కాంటన్‌ పోలీసు విభాగం విడుదల చేయగా.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అది వైరల్‌గా మారింది.

ఏప్రిల్ 18న ఓ కారు యాక్సిడెంట్‌ కేసులో అనుమానితుడిగా ఫ్రాంక్‌ టైసన్‌ను పోలీస్‌ అధికారులు గుర్తించారు. దీంతో సమీపంలోని ఓ బార్‌లో ఉన్న టైసన్‌ను పెట్రోలింగ్‌ పోలీసులు నిర్భందించి, అతని పట్ల దారుణంగా వ్యవహరించారు. టైసన్‌ను పట్టుకొన్న పోలీసులు అతని చేతులకు సంకెళ్లు వేసి, కింద పడేయడం వీడియోలో చూడొచ్చు. దీంతో బాధితుడు ‘నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, షెరీఫ్‌ను పిలవండి’ అంటూ గట్టిగా అరవడం వీడియోలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

పోలీసు అధికారుల్లో ఒకరు టైసన్‌ మెడ సమీపంలోని వెనుక భాగంలో మోకాలు వేసి దాదాపు 30 సెకన్లపాటు గట్టిగా నొక్కి పెట్టాడు. దీంతో ‘నాకు ఊపిరి ఆడటం లేదు’ అని టైసన్‌ పదేపదే చెబుతున్నా పోలీసులు కనికరించలేదు. ఆ తర్వాత కొంత సేపటికి టైసన్‌ చలనం లేకుండా నేలపై పడిపోవడం వీడియోలో కనిపిస్తుంది. 6 నిమిషాల పాటు ఉలుకూ పలుకూ లేకుండా అపస్మారక స్థితిలో పడిపోయిన టైసన్‌ను.. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. టైసన్‌ మృతికి అసలు కారణం ఏమిటన్నది అధికారులు వెల్లడించలేదు. ఈ ఘటనలో టైసన్‌ పట్ల క్రూరంగా ప్రవర్తించిన ఇద్దరు పోలీస్ అధికారులను బ్యూ స్కోనెగ్జ్, కామ్‌డెన్ బుర్చ్‌లుగా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరినీ అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌లో ఉంచారు. ఓహియో బ్యూరో ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ (OCI) సంఘటనపై దర్యాప్తు చేస్తోంది.

కాగా సరిగ్గా నాలుగేళ్ల క్రితం కూడా ఇదే విధంగా పోలీసుల కర్కశత్వానికి జార్జిఫ్లాయిడ్‌ అనే వ్యక్తి బలైపోయాడు. ఆఫ్రో అమెరికన్‌ అయిన జార్జి ఫ్లాయిడ్‌ మెడపై డెరేక్‌ చౌవిన్‌ అనే పోలీసు అధికారి దాదాపు తొమ్మిది నిమిషాలకు పైగా మోకాలుతో తొక్కి పెట్టడంతో.. అతను ఊపిరాడక మృతిచెందాడు. అప్పట్లో ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అయ్యింది. అమెరికాలో పోలీసుల క్రూరత్వం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలను రేకెత్తించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.