Aruna Miller: అగ్రరాజ్యంలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ.. లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణ ఎన్నిక
అమెరికా మేరీలాండ్ స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలుగు మహిళ అరుణా మిల్లర్ ఎన్నికయ్యారు.. ఈ పదవికి ఎన్నికైన తొలి భారతీయ సంతతి మహిళగా రికార్డు సృష్టించారు..
జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జో బైడెన్ పాలనా యంత్రాంగంలో 130 మందికిపైగా భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో జరిగిన మిడ్‌టర్మ్ ఎలక్షన్స్‌లో ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి ఆనందం కలిగించిన వార్త వచ్చింది. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా భారత సంతతికి చెందిన అరుణా మిల్లర్ ఎన్నికయ్యారు. అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు అరుణ మిల్లర్.. ఆమె తెలుగు మహిళ కావడం మరో విశేషం.. డెమోక్రాట్ పార్టీ తరపున మేరీలాండ్ గవర్నర్ పదవికి వెస్ మూర్, లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి అరుణా మిల్లర్ పోటీ చేసి రిపబ్లికన్ అభ్యర్థులను ఓడించారు. మేరీలాండ్‌లో గవర్నర్ తర్వాత హోదా లెఫ్టినెంట్ గవర్నర్. గవర్నర్ లేని సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ ఆ బాధ్యతల్లో ఉంటారు.
58 ఏళ్ల అరుణా మిల్లర్ తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించారు. అరుణ కుటుంబం ఆమె ఏడేళ్ల వయసులో అమెరికాకు వలస వెళ్లింది. న్యూయార్క్‌లో పెరిగిన అరుణ మిస్సౌరీ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో BS డిగ్రీ పొందారు. 1990లో మేరీలాండ్ వెళ్లారు. ఆమె కాలిఫోర్నియా, హవాయి, వర్జీనియాలోని స్థానిక ప్రభుత్వాలకు రవాణా ఇంజనీర్‌గా పనిచేసి.. 90వ దశకంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
ఆమె అనేక శాసనసభ పదవులను నిర్వహించారు. 2010 నుంచి 2018 వరకు మిల్లెర్.. మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో డిస్ట్రిక్ట్ 15కి ప్రాతినిధ్యం వహించారు. 2018లో ఆమె రాష్ట్రంలోని 6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు.. కానీ డెమోక్రటిక్ ప్రైమరీలో డేవిడ్ ట్రోన్ చేతిలో ఓడిపోయారు.
అరుణ మిల్లెర్ కు రాష్ట్రంలో ప్రజాధరణ ఎక్కువగా ఉంది. మిల్లెర్ తరపున అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ కూడా ప్రచారం నిర్వహించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రవాస భారతీయులు కూడా అరుణా మిల్లర్ విజయానికి సహకరించారు. మేరీలాండ్ ప్రజల కోసం నిబద్దతతో సేవలు అందిస్తానని.. తన విజయం అరుణ తర్వాత ప్రకటించారు. మేరీల్యాండ్ అభివృద్ధికి పాటుపడతానని.. ఐక్యతతో హక్కుల కోసం పనిచేస్తానని మిల్లర్ తన విజయ ప్రసంగంలో చెప్పారు.
The moral to this story is, NEVER EVER underestimate the underdogs.
And guess what – we’ll always look out for the underdogs.
We see you. We hear you. We believe in you. And @iamwesmoore and I are going to fight for you.
— Aruna Miller (@arunamiller) November 9, 2022
కాగా.. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం రాష్ట్రంలో ఎన్నికైన మొదటి ఆసియా-అమెరికన్ కూడా మిల్లెర్ కావడం గమనార్హం. అరుణా మిల్లెర్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ఎన్నిక కావడం పట్ల ప్రవాసులు, తెలుగు ప్రజలు పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..