Afghanistan: ఆ దేశంలో మహిళలు విలవిల.. దెబ్బతిన్న హస్తకళల మార్కెట్.. ఆదుకోమంటూ ఆందోళన
మహిళలు ఆఫ్ఘన్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా హస్తకళల మార్కెట్‌లో భారీగా తగ్గుదల చోటు చేసుకుందని కొంతమంది మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హస్తకళల మార్కెట్‌ను పెంచడానికి సంబంధిత సంస్థల నుండి మద్దతు కోరుతున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, అక్కడ పరిస్థితి నరకం కంటే దారుణంగా మారింది. ముఖ్యంగా మహిళల పరిస్థితి మరింత దిగజారింది. మహిళల హక్కులు హరించబడ్డాయి. రకరకాల ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. స్త్రీలు చదువుపై నిషేధం, దుస్తులపై నిషేధం అమలు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో అక్కడి హస్తకళల మార్కెట్ భారీగా తగ్గుముఖం పట్టింది. దీంతో హస్తకళలపై ఆధారపడిన ఆఫ్ఘన్ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళలు ఆఫ్ఘన్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా హస్తకళల మార్కెట్‌లో భారీగా తగ్గుదల చోటు చేసుకుందని కొంతమంది మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హస్తకళల మార్కెట్‌ను పెంచడానికి సంబంధిత సంస్థల నుండి మద్దతు కోరుతున్నారు. ఆఫ్ఘన్‌కు చెందిన మహిళా పెట్టుబడిదారు రోఖ్‌సర్ తాలిబాన్‌ల సహాయం కోరింది. రోఖ్‌సర్‌కు హస్తకళలో నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది.
మహిళలకు మద్దతు ఇవ్వాలి- రోఖ్‌సర్
రోఖ్‌సర్ మాట్లాడుతూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి మరింత అభివృద్ధి చెందేలా వారికి అండగా నిలబడాలని కోరుతున్నారు. ఆగస్ట్ 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ ఆక్రమించినప్పటి నుండి ఒక్క హస్తకళల వ్యాపారం మాత్రమే కాదు అన్ని రకాల వ్యాపారాలు క్షీణించాయని వ్యాపారవేత్త బెనాఫ్షా చెప్పారు. ప్రజల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో అమ్మకాలు తగ్గాయని బెనాఫ్‌షా తెలిపింది. ఇక్కడ ప్రజలు ఉత్పత్తులను కొనుగోలు చేయలేరు. అదే సమయంలో ఎయిర్ కారిడార్లను మూసివేయడం వల్ల ఈ దేశంలో తయారయ్యే ఉత్పత్తులు విదేశాలకు వెళ్లడం లేదన్నారని చెప్పారు.
తాలిబన్లు సహాయం చేస్తామని హామీ
తాలిబాన్ నేతృత్వంలోని పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అఖుంద్జాదా అబ్దుల్ సలామ్ జవాద్ మాట్లాడుతూ వ్యాపార మహిళలకు సహాయం చేయడానికి తాలిబాన్ కట్టుబడి ఉందని అన్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. హస్తకళల వ్యాపారంలో నిమగ్నమైన మహిళలకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని జవాద్ చెప్పారు.
మహిళల కోసం హస్తకళల మార్కెట్‌ను సిద్ధం చేస్తోన్న ప్రభుత్వం
ఇప్పటికే మహిళల కోసం.. హస్తకళల కోసం దేశం లోపల, వెలుపల మార్కెట్‌లను సృష్టిస్తున్నామని.. తద్వారా మహిళలు దేశ వాణిజ్య రంగంలో శక్తివంతమైన భాగంగా గణనీయమైన సహకారం అందించగలరని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్, లఘ్‌మన్, కునార్, నూరిస్తాన్, హెరాత్ ,కాబూల్‌తో సహా 16 ప్రావిన్సులలో మహిళా వాణిజ్య సంస్థలు తెరిచి ఉన్నాయని ఉమెన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..