AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మృత్యు గనిగా మారిన షాన్సీ.. చైనా బొగ్గు గని భారీ పేలుడు.. 90 మంది బలి!

చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో ఒక ఘోరమైన బొగ్గు గని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 90 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది గల్లంతయ్యారు. గత దశాబ్ద కాలంలో చైనా గనుల రంగంలో జరిగిన అత్యంత భారీ మరియు ఘోరమైన ప్రమాదంగా దీనిని భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయి.

మృత్యు గనిగా మారిన షాన్సీ.. చైనా బొగ్గు గని భారీ పేలుడు.. 90 మంది బలి!
China Coal Mine Explosion
Balaraju Goud
|

Updated on: May 23, 2026 | 2:05 PM

Share

చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో ఒక ఘోరమైన బొగ్గు గని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 90 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది గల్లంతయ్యారు. గత దశాబ్ద కాలంలో చైనా గనుల రంగంలో జరిగిన అత్యంత భారీ మరియు ఘోరమైన ప్రమాదంగా దీనిని భావిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయి. ఈ ఘటన భద్రతా లోపాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ ఆదేశించారు.

ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ‘జిన్హువా’ కథనం ప్రకారం.. దేశ రాజధాని బీజింగ్‌కు సుమారు 520 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాన్సీ ప్రావిన్స్, కిన్యువాన్ కౌంటీలోని ఒక బొగ్గు గనిలో శుక్రవారం (మే 22) ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు గనిలో ప్రమాదకరమైన ‘కార్బన్ మోనాక్సైడ్’ వాయువు స్థాయిలు పెరిగినట్లు హెచ్చరికలు వచ్చాయి. ఆ వెంటనే ఊహించని విధంగా భారీ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో గని లోపల మొత్తం 247 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.

పేలుడు ధాటికి గని కూలిపోవడంతో భారీ సంఖ్యలో కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన అత్యవసర రెస్క్యూ బృందాలు పలువురిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగినప్పటికీ, అప్పటికే 90 మంది మరణించారు. గల్లంతైన మిగిలిన తొమ్మిది మంది కోసం సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.

ఈ దారుణ ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీవ్రంగా స్పందించారు. గల్లంతైన వారిని కనుగొనేందుకు అన్ని శక్తులూ ఒడ్డాలని రెస్క్యూ బృందాలను ఆదేశించారు. అలాగే, భద్రతా లోపాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రాలు ఈ ప్రమాదం నుండి గుణపాఠం నేర్చుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా నిబంధనలను పటిష్టం చేయాలని సూచించారు. ప్రస్తుతం దేశంలో వర్షాకాలం కొనసాగుతున్నందున వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

మరోవైపు చైనా ప్రధాని లీ కెకియాంగ్ స్పందిస్తూ.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాద కారణాలపై త్వరితగతిన దర్యాప్తు జరిపి బాధ్యులను శిక్షించాలని అధికారులను ఆదేశించారు. చైనా ఉప ప్రధాని జాంగ్ గువోకింగ్ సహా పలువురు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

షాన్సీ ప్రావిన్స్ చైనాలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కేంద్రం. ఇటీవలి కాలంలో గనుల భద్రతను మెరుగుపరిచామని చైనా ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, నిరంతరం జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2023 ఫిబ్రవరిలో ఇన్నర్ మంగోలియాలో జరిగిన ప్రమాదంలో 53 మంది, గత నెల షాన్సీలోని లులియాంగ్‌లో నలుగురు కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ తాజా ప్రమాదం చైనా మైనింగ్ రంగంలో భద్రతా లోపాలను మరోసారి ఎత్తిచూపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us