Adilabad CCI: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ కోసం కేంద్రంపై ఒత్తిడి చేస్తాం.. మంత్రి కేటీఆర్ ప్రకటన..
Adilabad CCI: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ కోసం కేంద్రం పైన ఒత్తిడి తీసుకువస్తామమని తెలంగాణ..
Adilabad CCI: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ కోసం కేంద్రం పైన ఒత్తిడి తీసుకువస్తామమని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. ఆదిలాబాద్‌కు చెందిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు జిల్లాకు చెందిన ఇతర ముఖ్య నాయకులు ఇవాళ మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. కంపెనీ పునః ప్రారంభం చేపట్టాల్సిన ఆందోళన కార్యాచరణపై చర్చించారు. కంపెనీ పునః ప్రారంభం కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నామని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మేరకు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరిన విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు. సీసీఐ పునఃప్రారంభానికి అవసరమైన అన్ని రకాల ప్రత్యేక రాయితీలను ఇస్తామని, కొత్త కంపెనీని ఏర్పాటు చేస్తే ఎలాంటి రాయితీలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుతాయో వాటిని సిసిఐ కి అందించేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.
ఒకవైపు ఉమ్మడి ఆదిలాబాద్‌లో అనేక పరిశ్రమలను స్థాపించి జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పన కోసం తాము ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అప్పనంగా అమ్మేవేసేందుకు కుట్ర చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆదిలాబాద్‌లోని సిసిఐ పునరుద్ధరణ చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులను స్వయంగా కలిశామని, అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ఇప్పటిదాకా కేంద్రం నుంచి ఏలాంటి సానుకూల స్పందన లేదన్నారు. ఇప్పటికే ఆదిలాబాద్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లుని ప్రారంభించిన చరిత్ర, నిబద్ధత తమకు ఉందన్నారు. మరోవైపు జిల్లాకు సిరుల వరప్రధాయిని అయిన సింగరేణిని క్రమంగా ప్రైవేటీకరించే ప్రయత్నాలకు కేంద్రం తెరలేపిందని కేటీఆర్ అన్నారు. సిసిఐ విషయంలో అవసరమైతే అదిలాబాద్ యువత ప్రయోజనాల కోసం ఢిల్లీకి సైతం వెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలోనే ఆదిలాబాద్‌కు ఐటీ టవర్ ను మంజూరు చేస్తామని చెప్పారు. దీంతో పాటు టెక్స్ట్ టైల్ పార్కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను సైతం సిద్ధం చేయాలని అధికారులను కోరినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
సీసీఐ ఏర్పాటు కోసం అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఇందుకు సంబంధించిన ఉద్యమ కార్యాచరణ చేపడతామని మంత్రి కేటీఆర్‌కి స్థానిక నాయకత్వం తెలిపింది. ఈ విషయంలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సాధన సమితిగా ఏర్పడి ఉద్యమిస్తామని తెలిపారు. ఈ విషయంలో అదిలాబాద్ కి చెందిన బీజేపీ ఎంపీ ని కేంద్ర ప్రభుత్వంపై సిసిఐ పునరుద్ధరణ కోసం ఒత్తిడి తీసుకురావాలని నిలదీస్తామన్నారు. సీసీఐ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేయడం పట్ల ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న అదిలాబాద్ జిల్లా ప్రజల పట్ల ధన్యవాదాలు తెలిపారు.
Also read:
Telangana: కోవిడ్ పాజిటివ్ మహిళకు ప్రసవం చేయడానికి వైద్యుల నిరాకరణ.. వారిపై సీరియస్ యాక్షన్
Ashok Babu: ‘కుట్రలో భాగంగానే నాపై ఫిర్యాదు’.. సంచలన ఆరోపణలు చేసిన అశోక్ బాబు..