Watch Video: రోడ్డులేక 3KM నరకయాతన.. మార్గమధ్యలోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!
శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒక వైపు దేశం దూసుకెళ్తున్నా.. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అడవులకు సమీపంలో ఉండే ఆదివాసి గ్రామాలకు రోడ్లుకూడా లేక వారు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా తమ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో ఒక గర్భిణీ అక్కడే ప్రసవవేదన పడి.. అడవితల్లి సాక్షిగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దేవుడి దయతో ప్రస్తుతం తల్లిబిడ్డ సరక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ఓ పక్కన దూసుకెళ్తోంది. ఈ పరిస్థితుల్లోనూ మారుమూల అటవీ గ్రామాలకు రోడ్లు లేక నిత్యం ఆదివాసీలు నరకయాతన పడుతున్నారు. ఇలాంటి ఓ కీకారణ్య గ్రామానికి చెందిన గర్భిణి రోడ్డే లేని ఆ గ్రామంలో ప్రసవ వేదన పడింది.. అడవి తల్లి సాక్షిగా అడవిలోనే నరక యాతన పడుతూ ఆడపిల్లను జన్మనిచ్చింది. దేవుడి దయతో ప్రస్తుతం తల్లిబిడ్డ సరక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఈ దయనీయ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చర్ల మండల పరిధిలోని వీరాపురం గ్రామానికి చెందిన గర్భిణీ పోడియం ఇరమ్మకు తెల్లవారు జామున 3 గంటల సమయంలో ప్రసవ నొప్పులు వచ్చాయి. హాస్పిటల్‌కు తీసుకెళ్దామంటే తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. ఇక చేసేదేమీ లేక ఆమె కుటుంబ సభ్యులు గ్రామంలోని ఆశా వర్కర్ గంగమ్మ సాయంతో వీరాపురం గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల మేర కటిక చీకటి.. దట్టమైన అడవిలో గర్భిణీను జెట్టీలో నానా యాతన పడుతూ మోసుకొచ్చారు. బురదలో జెట్టిని మోయలేక ఒకసారి గర్భిణీతో సహా కింద పడిపోయారు. అనంతరం అడవిలోనే ఇరమమ్మ ఆడపిల్లను ప్రసవించింది. అక్కడే అందుబాటులో ఉన్న ఆశ కార్యకర్త గంగమ్మ తనకు వచ్చిన వైద్యంతో బొడ్డు పేగును కత్తిరించించింది. ఆ తర్వాత తిరిగి జెట్టీ లోనే బాలింతను కుటుంబ సభ్యులు ముందుకు మోసుకెళ్లారు.
అయితే అప్పటికే కుదునూరు శివారు తాలిపేరు కాల్వ వరకు 108 వాహనం చేవచ్చింది. దీంతో తల్లీ, బిడ్డను కుటుంబ సభ్యులు అంబులెన్స్ వద్దకు చేర్చారు. ఆ తర్వాత ఈఎంటీ ప్రాథమిక చికిత్సలు చేసి బాలింతను సత్యనారాయణపురం పీహెచ్‌సీకు తరలించారు. అక్కడ తల్లీ, బిడ్డలకు వైద్యులు పూర్తిస్థాయి వైద్యం అందించారు. ప్రస్తుతం తల్లి,బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా దశాబ్దాలుగా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమయితోందని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. కుదునూరు నుంచి వీరాపురానికి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ అటవీ అనుమతులు లేని కారణంగా రోడ్డు పనులు నిలిచిపోయాయి. ఇప్పటికైనా తమ గ్రామానికి రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని ఆదివాసీలు అధికారులను కోరుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




