Telangana: పండగపూట ఘోర ప్రమాదం.. రెండు బైకులు ఢీ.. స్పాట్‌లోనే ముగ్గురు..
రంగారెడ్డి జిల్లా పహాడీ షరీఫ్ పరిధిలోని హర్షగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన రెండు బైకులు ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పండగ సమయంలో జరిగిన ఈ దుర్ఘటనతో వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించి, కేసు నమోదు చేశారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. హర్షగూడ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. పల్సర్ బైక్‌పై వస్తున్న ఒక యువకుడు ఎదురుగా వస్తున్న మరో మైక్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యూనికార్న్ బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పల్సర్ బైక్‌పై వెళుతున్న ఓ యువకుడు కూడా మరణించాడు. మృతి చెందిన యువకులను మోహన్, సిద్దు, అరుణ్‌గా పోలీసులు గుర్తించారు.
విషయం తెలుసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతివేగంమూ ఈ ఘోర ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. పండగపూట యువకులు మరణించండంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




