Telangana: ఓట్ల కోసం కుయుక్తులు.. క్షుద్రపూజలతో భయబ్రాంతులు
ఓట్ల కోసం కుయుక్తులు.. క్షుద్రపూజలతో భయబ్రాంతులు. ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని ఓడించేందుకు సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఐతే.. క్షుద్రపూజలతో భయపెట్టేందుకూ తెగ బడుతున్నారు కొందరు అభ్యర్థులు. పదవి కోసం ఇలాంటి నీచపు పనులకు ఒడిగట్టే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓటర్లు.

మొన్న ఖమ్మంలో.. ఇవాళ మక్తల్‌లో..! పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం క్షుద్రపూజల్ని కూడా నమ్ముకుంటున్నారు కొందరు. ప్రత్యర్థులు ఓడిపోవడం కోసం.. ఓం భీమ్ బుష్ అంటూ.. ఏవేవో పూజలు చేస్తున్నారు. రేపు తుది విడత ఎన్నికలు జరుగుతున్న ఓ గ్రామంలో ఈ క్షుద్రపూజల ఉదంతం వెలుగులోకి వచ్చింది.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్‌లో బీజేపీ బలపరచిన అభ్యర్థి వెంకటమ్మ ఇంటిముందు అర్థరాత్రి క్షుద్రపూజలు చేసినట్టు ఆనవాళ్లు కనిపించాయి. తెల్ల ఆవాలు, పసుపుతో పాటు మరికొన్ని రకాల వస్తువులు ఏవో చల్లి పూజలు చేశారు. ఉదయాన్నే ఇంటిముందు ఇలాంటి దృశ్యం చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురైంది.. వెంకటమ్మ కుటుంబం. క్షుద్రపూజలతో కీడు వెంటాడుతుందనే భయంతో వెంకటమ్మ భర్త మోహన్ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఇదంతా కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థి బంధువులపనే అంటూ వెంకటమ్మ కుటుంబం ఆరోపిస్తోంది. సీసీ ఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాల ఆధారంగా ఇదంతా కాంగ్రెస్ మద్దతుదారు రేణుక మామ అయిన రాములు చేసినట్టుగా నిర్థారణకు వచ్చారు. ఆయన కూడా దీన్ని ఒప్పుకున్నాడని చెప్తున్నారు. పోలింగ్ స్టేషన్ ముందు కూడా ఇదే రకంగా రాములు పూజలు చేశాడని చెప్తున్నారు. ఎలక్షన్ టైమ్‌లో ఈ క్షుద్రపూజల ఎపిసోడ్ ఊళ్లో పెద్ద టెన్షన్ వాతావరణాన్నే సృష్టించింది.
రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లా గోళ్లపాడులోనూ క్షుద్రపూజలు కలకలం రేపాయి. కత్తెర గుర్తు స్లిప్ ఉంచి క్షుద్ర పూజలు చేశారు. మరికొద్ది గంటల్లో పోలింగ్ మొదలవుతుందనగా.. పంచాయతీ ఆఫీస్ ముందు ఇలాంటి దృశ్యం కనిపించడంతో గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది.
కేవలం సర్పంచ్ పదవి కోసం.. ఇలాంటి దుష్ట ఆలోచనలకు పాల్పడుతున్నారు కొందరు అభ్యర్థులు. అయినా.. మంత్రాలకు చింతకాయలు రాలవనే సామెత కూడా ఉంది. అలాంటిది.. ఓట్లు ఎలా పడతాయని.. ఈ క్షుద్ర బుద్ధిని ప్రదర్శించారో వారికే తెలియాలి.




