Hyderabad: అద్దె ఇల్లు గొడవ.. క్షణికావేశం మనిషి ప్రాణాల మీదకు తెచ్చింది..!
వారం రోజుల క్రితం ఇల్లును ఖాళీ చేయించాడు ఇంటి యాజమాని. ఆపై ఆ ఇల్లును ఒక మటన్ దుకాణానికి అద్దెకు ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నాడు
అద్దెకు ఇచ్చిన ఇల్లు విషయంలో గొడవ చివరికి ఒక మనిషి ప్రాణాలు తీసేవరకు వెళ్లింది. అద్దెకు ఉంటూనే తిరిగి యజమానిపైనే అజమాయిషీ చెలాయించే స్థాయిలో నిందితులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇల్లును ఎవరికి అద్దెకి ఇస్తున్నామో, అసలు ఎలాంటివారో తెలుసుకోకుండా మనుషులను నమ్మితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్ మహానగరం మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. సయ్యద్ వాహెద్ ముదబ్బీర్ మహదీ అనే 27 ఏళ్ల వ్యక్తి గతంలో ఐటీ కంపెనీలో పని చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. కొత్త రోడ్డు ఎదురుగా బ్యాంకు వద్ద ఉన్న తన ఇల్లును కొందరు యువకులకు అద్దెకు ఇచ్చాడు. అయితే.. ఆ అద్దెకు దిగినవారు అందులో AIMIM పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రుళ్ల వరకు ఆ ఆఫీసులోనే వారంతా గంటల తరబడి కాలక్షేపం చేస్తూ ఇరుగుపొరుగు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ విషయమై స్థానికులు యజమాని సయ్యద్ వాహెద్‌కు ఫిర్యాదు చేయడంతో కొన్నిసార్లు వారిని వారించాడు. అయినా ఎలాంటి ఫలితం లేకపోగా.. ఆ యువకులు తమ ఆగడాలను మరింత తీవ్రతరం చేశారు. ఇదంతా గమనించి ఎలాగైనా దీనికి ఒక పరిష్కారం చూడాలని యజమాని భావించాడు.
ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం ఇల్లును ఖాళీ చేయించాడు. ఆపై ఆ ఇల్లును ఒక మటన్ దుకాణానికి అద్దెకు ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆ యువకులలో ఆదిల్ అనే వ్యక్తి వచ్చి ఆ ఇంటిని మటన్ షాప్‌కు ఇవ్వవద్దని యజమాని సయ్యద్ వాహెద్‌తో గొడవకు దిగాడు. తన ఇంటిని ఇవ్వొద్దు అనడానికి నీకు ఏం హక్కు ఉందని యజమాని ఎదురు తిరగడంతో గొడవ మరింత ముదిరింది. దీంతో వాహెద్‌ను తీవ్రంగా బెదిరించి ఆదిల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గొడవను అంతటితో ఆపకుండా ఆ యువకులు ఎలాగైనా పగ తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో అదే రోజు సాయంత్రం డబీర్‌పురా సమీపంలోని ఎంఎం టవర్ వద్ద తన ఇంటి ముందు నిలబడిన సయ్యద్ వాహెద్‌పై కత్తితో తీవ్రంగా దాడి చేశారు. ఆ దాడిలో వాహెద్ కుడి చేతికి పెద్ద గాయమైంది. దీంతో స్థానికులు బాధితుడిని ఆటోలో యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
కాగా, జరిగిన ఘటనపై సయ్యద్ వాహెద్ ముదబ్బీర్ మహదీ మాదన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తనపై నలుగురు యువకులు కత్తితో దాడి చేసినట్లు ఫిర్యాదు చేయడంతో నిందితులలో A1గా నజీర్ ఖాన్, A2గా నిసార్ ఖాన్, A3గా ముక్దర్ ఖాన్, A4గా ఆదిల్‌లను చేర్చారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..