Hyderabad: ప్రజల్ని కాపాడాల్సినవాళ్లే ఎర అవుతున్నారు.. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి.?
క్రికెట్ బెట్టింగ్‌పై అవగాహన కల్పించాల్సిన పోలీసులే కొంతమంది దానికి బానిసలుగా మారి అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా పలువురు పోలీస్ కానిస్టేబుళ్లు క్రికెట్ బెట్టింగుల్లో నష్టాల పాలయి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు రోడ్డుపాలైన పరిస్థితి ఉంది.

ఇటీవల కాలంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలువురు పోలీస్ కానిస్టేబుళ్లు బెట్టింగ్‌కు అలవాటుపడ్డారు. ఆన్లైన్ బెట్టింగ్‌ల్లో పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందని నమ్మి మోసపోయారు. వచ్చిన జీతం మొదలు స్నేహితుల నుంచి అప్పులు తీసుకుని ఆన్లైన్ బెట్టింగ్ సైట్స్‌లో డబ్బులు పెట్టారు. తిరిగి లాభాలు రాకపోగా లక్షల్లో అప్పు పేరుకుపోతుంది. దిక్కుతోచని స్థితిలో ఇక చేసేది ఏమీ లేక భారమంతా కుటుంబం మీద వేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒకవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బెట్టింగ్ భూతంపై నిరంతరం అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అనేక కేస్ స్టడీస్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. గత కొద్ది రోజులుగా డిపార్ట్మెంట్‌కు సంబంధించిన సిబ్బంది కొంత మంది బెట్టింగ్ బారిన పడి ఆత్మహత్య లు చేసుకున్నారు. గత నెల తొమ్మిదో తారీఖున ఉప్పల్‌కి చెందిన శ్రీకాంత్ అనే కానిస్టేబుల్ ఆన్లైన్ బెట్టింగుకు బానిసయ్యి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. 2009 బ్యాచ్‌కు చెందిన శ్రీకాంత్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 23 నుంచి విధులకు హాజరు కాకపోవడంతో ఫిలింనగర్ పోలీసులు నోటీసులు పంపించారు. అప్పటికే ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న శ్రీకాంత్ జియాగూడలో ఉన్న తన ఇంటిని సైతం అమ్మేసి డబ్బులు చెల్లించాడు. అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండటంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇక సంగారెడ్డిలో బెట్టింగ్ భూతం కానిస్టేబుల్‌ను బలిగొన్న సంఘటన చోటుచేసుకుంది. కల్హేరు మండల కేంద్రానికి చెందిన సందీప్‌కి గత సంవత్సరం కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అతను సంగారెడ్డిలోని టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సందీప్‌కు చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం రావడంతో, ఆ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషించారు. కానీ సందీప్ లోన్ యాప్, బెట్టింగ్ గేమ్‌కు అలవాటుపడి తన ప్రాణాన్ని తీసుకున్నాడు. విధుల్లో కూడా ఎప్పుడు చురుగ్గా ఉండేవాడు.. కాగా గత రెండు రోజులుగా సందీప్ ముభావంగా ఉంటున్నాడని, ఎప్పుడు ఏదో తెలియని భయంతో ఉండేవాడని తోటి ఉద్యోగులు చెప్పుకొచ్చారు. ఏం జరిగిందో తెలియదు, ఈ రోజు పోలీస్ స్టేషన్లోని పిస్టల్ తీసుకొని సంగారెడ్డి కేంద్రంలోని మహబూబ్ సాగర్ వద్ద సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన చాతిపై తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. సందీప్ వార్త విన్న కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ అదృశ్యమైన సంఘటన కలకలం రేపుతోంది. 2018 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ రమేష్ గత కొన్నాళ్లుగా బెట్టింగ్ అలవాటుకు బానిసై భారీగా డబ్బులు కోల్పోయినట్టు తెలుస్తోంది. బెట్టింగ్‌లో మూడు లక్షల రూపాయలు పోగొట్టిన తర్వాత అప్పుల బారిన పడ్డాడు. ప్రస్తుతం బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న రమేష్, అప్పులు తీర్చడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లోన్ తీసుకున్నాడు. అయితే ఆ లోన్ మొత్తాన్ని కూడా డబుల్ అవుతుందని నమ్మి మళ్లీ బెట్టింగ్‌లో పెట్టినట్టుగా కుటుంబ సభ్యులకు అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రమేష్ ఇంట్లోనుంచి ‘బ్యాంక్‌కు వెళ్లి వస్తాను’ అని చెప్పి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో మల్లేశ్వరి ఆందోళనకు గురయ్యారు. భర్త కనిపించడం లేదంటూ ఆమె మధురానగర్ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రమేష్ మొబైల్ లొకేషన్, బ్యాంక్ లావాదేవీలు, అతని స్నేహితుల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆర్థిక ఒత్తిడి కారణంగా ఎక్కడికైనా వెళ్లిపోయాడా అనే కోణాల్లో కూడా విచారణ సాగిస్తున్నారు.కానిస్టేబుల్ అదృశ్యం కేసు బయటపడటంతో బెట్టింగ్‌కు బానిసై కుటుంబాలు ఎంతటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో మరోసారి బయటపడింది.
ఇక తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ కృష్ణ చైతన్య తన సర్వీస్ రివాల్వర్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రెండు సంవత్సరాల నుండి బెట్టింగ్ బానిసగా మారి లక్షల కొద్ది అప్పులు చేయటంతో పాటు గత కొంతకాలంగా ఇంటికి దూరంగా ఉంటున్నాడు. వచ్చిన జీతం మొత్తం కూడా చేసిన అప్పులు తీర్చేందుకే అయిపోతుండటంతో చేసేది లేక రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఒకవైపు బెట్టింగ్‌కు పాల్పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని సమాజానికి హితువు పలకాల్సిన వాళ్లే బెట్టింగ్‌కు బానిసలుగా మారుతున్నారు. బెట్టింగ్‌కు పాల్పడి డబ్బులు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రోజుకి పెరుగుతుంది.. తాజాగా ఈ కోవలో పోలీస్ సిబ్బంది సైతం బాధితులుగా ఉంటున్నారు. గడిచిన కొంతకాలంగా పలువురు పోలీస్ సిబ్బంది, కానిస్టేబుల్ స్థాయి వాళ్ళు బెట్టింగులకు పాల్పడి ఆర్థిక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. తిరిగి వాటిని తీర్చలేక ఇంట్లోనుండి వెళ్లిపోవడం లేదా ఆత్మహత్య చేసుకోవడం చేసుకుంటున్నారు. దీంతో వారి మీద ఆధారపడ్డ కుటుంబం రోడ్డు మీద పడుతుంది.




