Hyderabad: హైదరాబాద్ వాసులకు తీపికబురు.. మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. పూర్తి వివరాలు
మెట్రో విస్తరణ, నిర్వహణ, నిధుల సమీకరణ వంటి అంశాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తరహాలో హైదరాబాద్ మెట్రోకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రెండో దశ మెట్రో ప్రాజెక్టు ప్రారంభానికి ముందే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి..

హైదరాబాద్ మెట్రో రైలు నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధి ఔటర్ రింగ్ రోడ్ దాటి విస్తరిస్తున్న నేపథ్యంలో, మెట్రో రైలు సేవలను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో మెట్రో నిర్వహణ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దానికి పూర్తి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న ఆలోచనను ముందుకు తీసుకొస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మెట్రో రెండో దశ విస్తరణకు భూసేకరణ అవసరం తక్కువగా ఉండనున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. నాగోల్–ఎల్బీనగర్ మార్గం మీదుగా విమానాశ్రయం వరకు నిర్మించనున్న కారిడార్‌తో పాటు ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపట్టే మరో మార్గంలో మాత్రమే అధికంగా భూసేకరణ అవసరం ఉంటుందని సమాచారం. మిగతా కారిడార్లలో సుమారు 30 శాతం భూములు సరిపోతాయని అంచనా వేస్తున్నారు.
భారీ వ్యయంతో మెట్రో రెండో దశ..
మెట్రో రెండో దశలో మొత్తం ఎనిమిది కారిడార్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇందులో పార్ట్-ఏ కింద ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర విస్తరణకు రూ.24,269 కోట్లను, పార్ట్-బీ కింద మూడు కారిడార్లలో 86.1 కిలోమీటర్ల మేర విస్తరణకు రూ.19,579 కోట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టును కేంద్రం–రాష్ట్రం కలిసి 50:50 జాయింట్ వెంచర్‌గా అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అన్ని కారిడార్లకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టులను కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు అధికారులు తెలిపారు.
ఎల్అండ్ టీ నుంచి తొలి దశ టేకోవర్
మెట్రో తొలి దశను పీపీపీ విధానంలో చేపట్టిన ఎల్అండ్ టీ నుంచి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎల్అండ్ టీ అధీనంలో ఉన్న భూములు, ఆస్తుల లీగల్ అసెస్మెంట్ బాధ్యతను ఐడీబీఐ కన్సల్టెన్సీకి అప్పగించారు. మరో రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. టెక్నికల్ అసెస్మెంట్ కోసం మరో ప్రత్యేక కన్సల్టెన్సీని నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
212 ఎకరాలే రెండో దశకు ఆదాయ వనరు
ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్ కింద ఎల్అండ్ టీకి కేటాయించిన 269 ఎకరాల్లో, అప్పట్లో ఇవ్వాల్సిన 57 ఎకరాలు ఇవ్వకపోవడంతో 212 ఎకరాల్లోనే కమర్షియల్ అభివృద్ధి జరిగింది. హైటెక్ సిటీ, రాయదుర్గం, ఎర్రమంజిల్, పంజాగుట్ట, మూసారాంబాగ్ ప్రాంతాల్లో మాల్స్ నిర్మించగా, కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని ఉపయోగించి రెండో దశ మెట్రో పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
విస్తరణలో కీలక మార్గాలు ఇవే
మెట్రో రెండో దశలో నాగోల్–ఎల్బీనగర్ మీదుగా విమానాశ్రయం వరకు 36.8 కిలోమీటర్లు, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు 13.4 కిలోమీటర్లు, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7.1 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లు ప్రతిపాదించారు. అలాగే జేబీఎస్ నుంచి మేడ్చల్, శామీర్పేట్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కూడా కొత్త మార్గాలు అభివృద్ధి చేయనున్నారు.
ఓల్డ్ సిటీ పనులకు తొలి ప్రాధాన్యం
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న ఓల్డ్ సిటీ కారిడార్‌లో ఇప్పటికే ఎక్కువభాగం భూసేకరణ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం నుంచి డీపీఆర్‌కు అనుమతి వచ్చిన వెంటనే ఈ మార్గంలో పనులను మొదట ప్రారంభించనున్నట్లు తెలిపారు. మెట్రో నిర్వహణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు రెండో దశ విస్తరణ పూర్తయితే, హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పు రానుందని అధికారులు భావిస్తున్నారు.




