U19 Asia Cup Final 2025 : పాక్ దెబ్బకు బీసీసీఐ మైండ్ బ్లాక్..పరువు పోయాక పంచాయితీ మొదలెట్టిన జై షా టీమ్
U19 Asia Cup Final 2025 : అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఎదుర్కొన్న ఘోర పరాజయం ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచిన భారత్, తీరా ఫైనల్లో చేతులెత్తేయడంపై బోర్డు గుర్రుగా ఉంది.

U19 Asia Cup Final 2025 : అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఎదుర్కొన్న ఘోర పరాజయం ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచిన భారత్, తీరా ఫైనల్లో చేతులెత్తేయడంపై బోర్డు గుర్రుగా ఉంది. దీనిపై పూర్తి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 191 పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని బీసీసీఐ అవమానకరంగా భావిస్తోంది. సోమవారం (డిసెంబర్ 22, 2025) జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై సుదీర్ఘ చర్చ జరిగింది. సాధారణంగా టోర్నీ ముగిశాక మేనేజర్ ఇచ్చే రిపోర్టుతో సరిపెట్టే బోర్డు, ఈసారి మాత్రం పంథా మార్చింది. హెడ్ కోచ్ హృషికేశ్ కనిత్కర్, కెప్టెన్ ఆయుష్‌లను నేరుగా పిలిపించి వివరణ కోరాలని నిర్ణయించింది. ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో జట్టు ఇంతలా ఎందుకు తడబడింది? వ్యూహాల్లో లోపాలు ఎక్కడ ఉన్నాయి? అనే అంశాలపై బోర్డు గట్టిగా ప్రశ్నించనుంది.
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ అన్ని విభాగాల్లోనూ భారత్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్, సమీర్ మిన్హాజ్ (172 పరుగులు) వీరవిహారంతో 347 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు పేకమేడలా కూలిపోయారు. లీగ్ దశలో సెంచరీలతో రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ కేవలం 26 పరుగులకే పరిమితం కాగా, ఐపీఎల్ స్టార్ ఆటగాడు, కెప్టెన్ ఆయుష్ మాత్రే కేవలం 2 పరుగులకే పెవిలియన్ చేరి షాక్ ఇచ్చాడు. పాక్ బౌలర్ల ధాటికి టీమిండియా 156 పరుగులకే ఆలౌట్ కావడం బీసీసీఐ పెద్దలను విస్మయానికి గురిచేసింది. టోర్నీ అంతా బాగా ఆడి, పాకిస్థాన్‌తో ఫైనల్లోనే ఇలా ఎందుకు విఫలమయ్యారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
బీసీసీఐ ఈసారి కేవలం ఓటమికి గల సాంకేతిక కారణాలనే కాకుండా, మైదానంలో ఆటగాళ్ల క్రమశిక్షణపై కూడా దృష్టి సారించింది. మ్యాచ్ సమయంలో భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ దెబ్బతినేలా ఆటగాళ్లు ఎవరైనా ప్రవర్తించారా? అనే కోణంలో కూడా విచారణ జరగనుంది. భవిష్యత్తులో భారత సీనియర్ జట్టులోకి వెళ్లే ఈ కుర్రాళ్లు, ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి. క్రమశిక్షణతో ఎలా ఉండాలనే దానిపై బోర్డు కఠినంగా ఉండబోతోంది. మొత్తానికి పాక్ చేతిలో ఓటమి టీమిండియా మేనేజ్‌మెంట్‌లో పెద్ద మార్పులకే దారితీసేలా కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




