పట్టాలు తప్పిన సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్.. పదుల సంఖ్యలో గాయపడ్డ ప్రయాణికులు
ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ట్రాక్‌లో ఏమైనా సమస్య ఉందా లేదా డ్రైవర్ పొరపాటు వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని నల్పూర్‌లో ఈ ఉదయం రైలు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. ఈ ప్రమాదం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో జరిగినట్లు రైల్వే అధికారుల తెలిపారు.
పట్టాలు తప్పిన నాలుగు కోచ్‌లు
హౌరా-ఖరగ్‌పూర్ రైల్వే మార్గంలో ఈ రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పట్టాలు తప్పిన నాలుగు కోచ్‌లలో ఒకటి పార్శిల్ వ్యాన్ కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం తర్వాత ఘటనా స్థలంలో భీకర వాతావరణం నెలకొంది. రైలు వేగం సాధారణం కంటే తక్కువగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. ఒక్కసారిగా బలమైన షాక్ తగిలింది. సీటు పైన ఉంచిన వస్తువులు కింద పడ్డాయి. లోకో ఫైలట్ సడన్ బ్రేక్ వేయడంతో రైలు ఒక్కసారిగా అగినట్లు ప్రయాణికులు తెలిపారు. కొందరు ప్రయాణికులు రైలు నుంచి దిగి చూడగా నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు కనిపించింది.
సహాయక చర్యలు ముమ్మరం
22850 సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేసినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పట్టాలు తప్పిన కోచ్‌లకు కూడా పెద్దగా నష్టం జరగలేదు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రయాణికుల నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నారు.
ప్రమాదంపై సమగ్ర విచారణ
ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ట్రాక్‌లో ఏమైనా సమస్య ఉందా లేదా డ్రైవర్ పొరపాటు వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. రైలులో సాంకేతిక లోపం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైలులో ప్రయాణించే ప్రయాణికులకు తదుపరి ప్రయాణానికి రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టారు.
రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఈ ప్రమాదం తర్వాత హౌరా-ఖరగ్‌పూర్ రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైలు బోగీలను మళ్లీ పట్టాలపైకి తీసుకొచ్చే వరకు ఈ మార్గం గుండా వెళ్లే రైళ్లను ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. త్వరలో ఈ మార్గం నుంచి కూడా రైళ్లు నడవనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..