AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kedarnath: ప్రకృతితో మళ్లీ ఆటలా.. పేరుకుపోతున్న టన్నుల కొద్ది చెత్త.. మరో విపత్తు..?

కేదార్‌నాథ్ ఆలయం సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ హిమానీనదాలు ఉన్నాయి. పైగా హిమాలయాలు భూమ్మీద అతి తక్కువ వయస్సు కల్గిన పర్వత శ్రేణులు.

Kedarnath: ప్రకృతితో మళ్లీ ఆటలా.. పేరుకుపోతున్న టన్నుల కొద్ది చెత్త.. మరో విపత్తు..?
Kedarnath
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Nov 09, 2024 | 10:28 AM

Share

ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు మానవాళికి ఆ దైవం పంపే హెచ్చరికలు. మనిషి తన స్వార్థం, సౌలభ్యం కోసం ప్రకృతి వనరులను యదేచ్ఛగా విధ్వంసం చేస్తున్నాడు. కన్నెర్ర చేస్తున్న ప్రకృతి వైపరీత్యాలతో విరుచుకుపడుతూనే ఉంది. అత్యంత సున్నితమైన పర్వత శ్రేణులుగా పేరొందిన హిమాలయాల్లో మళ్లీ అవే తప్పులు జరుగుతున్నాయి. చార్‌ధామ్‌ పేరుతో ప్రసిద్ధిగాంచిన 4 పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌లో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతోంది. 2013లో ప్రకృతి సృష్టించిన విళయం కేదార్‌నాథ్ ఆలయం మినహా ఆ మార్గంలో గ్రామాలకు గ్రామాలనే తుడిచిపెట్టేసింది. అంత భారీ విపత్తులోనూ ఆలయం మాత్రం చెక్కుచెదరలేదు. మనిషి చేస్తున్న దుశ్చర్యలకు దైవం పంపిన హెచ్చరికగా ఆ ఘటన గురించి అప్పట్లో చెప్పుకున్నారు. గతానుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నారా అంటే అలాంటిదేమీ లేదని స్పష్టమవుతోంది. సమాచార హక్కు చట్టం (RTI) ప్రకారం ఓ సామాజిక కార్యకర్త అడిగిన ప్రశ్నకు అధికారులు ఇచ్చిన సమాచారం చూస్తే విస్తుబోవాల్సిందే. భక్తులు, యాత్రికుల తాకిడి కారణంగా పోగవుతున్న చెత్తను శుద్ధి చేయకుండా అక్కడ సహజసిద్ధంగా ఏర్పడ్డ గుంతల్లో నింపేస్తున్నారని వెల్లడైంది. సున్నితమైన ఈ ప్రాంతంలో గుంతలను చెత్తతో నింపేయడం పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన పెంచుతోంది.

ప్రతియేటా పెరుగుతున్న చెత్త

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన పర్యావరణవేత్త అమిత్ గుప్తా రాబట్టిన సమాచారం ప్రకారం 2022-2024 మధ్యకాలంలో కేదార్‌నాథ్ ఆలయ సమీపంలోని రెండు గుంతల్లో మొత్తం 49.18 టన్నుల శుద్ధిచేయని వ్యర్థాలను నింపేశారు. 2022లో 13.20 టన్నులు, 2023లో 18.48 టన్నులు, ఈ ఏడాది ఇప్పటివరకు 17.50 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. ఈ వ్యర్థాలను శుద్ధి చేసే వ్యవస్థ ఏదీ కేదార్‌నాథ్‌లో లేదని స్పష్టమైంది. వీటిని రీసైకిల్ చేస్తున్నామని కేదార్‌నాథ్ నగర్ పంచాయితీ అధికారులు చెబుతున్నప్పటికీ.. ఆ దాఖలాలు అక్కడ కనిపించడం లేదు. అక్కడి సిబ్బంది బాధ్యతారాహిత్యం చెత్తను గుంతల్లో పడేసి నింపేస్తున్నారని అర్థమవుతోంది.

స్వయంగా ప్రధాని చెప్పినా…

కేదార్‌నాథ్ ఆలయం సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ హిమానీనదాలు ఉన్నాయి. పైగా హిమాలయాలు భూమ్మీద అతి తక్కువ వయస్సు కల్గిన పర్వత శ్రేణులు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని పర్యావరణ సున్నిత (Eco Sensitive Zone) జోన్‌గా వ్యవహరిస్తారు. ఇలాంటి ప్రాంతాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి, ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర ‘మోదీ మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రస్తావించారు. అంతేకాదు, అనేక ఇతర వేదికలపై కూడా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ గురించి మాట్లాడారు. స్వచ్ఛ భారత్ పేరుతో పిలుపునిచ్చిన ఆయన స్వయంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే కేదార్‌నాథ్ వెళ్లే యాత్రికులు, భక్తులు, అధికార యంత్రాంగంలో ఏమాత్రం స్పృహ లేకుండా పోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2013 తరహా ప్రకృతి విపత్తులు పునరావృతమయ్యే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కేదార్‌నాథ్ ఆలయ సమీపంలో వ్యర్థాల గురించి సమాచారాన్ని రాబట్టిన సామాజిక కార్యకర్త, పర్యావరణ ప్రేమికుడు అమిత్ గుప్తా ఈ విషయమై గత రెండేళ్లుగా తానే స్వయంగా అధికారులకు లేఖలు రాస్తూ ఫిర్యాదులు చేస్తున్నానని తెలిపారు. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT), నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (NMCG)కి కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు. తన ఫిర్యాదు ఆధారంగా దీనిపై చర్యలు తీసుకోవాలని రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగానికి గంగా మిషన్ ఆదేశాలు జారీ చేసిందని వివరించారు.

అయితే ఇది కేవలం కేదార్‌నాథ్‌కి మాత్రమే పరిమితమైన సమస్య కాదని ఇతర పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కేదార్‌నాథ్ సహా హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి సహా అనేక ఇతర పుణ్యక్షేత్రాల్లో సైతం ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..