AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padma Shri: వైవిధ్యమైన ప్రాచీన కళ.. 12మెట్ల కిన్నెర రాగానికి పురస్కారం.. మొగిలయ్యను వరించిన పద్మశ్రీ

ఈ ఏడాది ప‌ద్మ అవార్డులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఏడు దక్కాయి.. అందులో తెలంగాణకు నాలుగు దక్కగా.. మూడు ఏపీకి దక్కాయి..

Padma Shri: వైవిధ్యమైన ప్రాచీన కళ.. 12మెట్ల కిన్నెర రాగానికి పురస్కారం.. మొగిలయ్యను వరించిన పద్మశ్రీ
Mogulaiah
Balaraju Goud
|

Updated on: Jan 26, 2022 | 8:48 AM

Share

Padma Shri Awards for Telangana: చేతిలో 12మెట్ల కిన్నెరను పట్టుకుని.. ఊరారా తిరుగుతూ ఓ వైపు కిన్నెర పాటను బతికిస్తూ.. మరోవైపు, తన కుటుబాన్ని పోషిస్తూ.. ఎన్ని కష్టాలొచ్చిన కిన్నెరను వదలని పాటగాడు.. మన దర్శనం మొగిలయ్య(Kinnera Mogilaiah).. ఇప్పుడాయన నిస్వార్ధ సేవను భారత ప్రభుత్వమే(Indian Government) గుర్తించింది. అత్యుత్తమ విశిష్ట పురస్కారం పద్మ అవార్డు(Padma Award)తో ఆయనను మరో మెట్టు ఎదిగేలా చేసింది.. గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదికి గానూ పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 పద్మ అవార్డులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఇందులో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యత దక్కింది. తాజా పురస్కారాల జాబితాలో మొగిలియ్యకు పద్మశ్రీ పురస్కారం దక్కింది.

ఇక‌, ఈ ఏడాది ప‌ద్మ అవార్డులు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఏడు దక్కాయి.. అందులో తెలంగాణకు నాలుగు దక్కగా.. మూడు ఏపీకి దక్కాయి.. తెలంగాణ నుంచి.. దర్శనం మొగిలయ్య–కళలు, రామచంద్రయ్య–కళలు, పద్మజా రెడ్డి–కళలు విభాగంలో పద్మశ్రీ అందుకోనున్నారు. అలాగే కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాకు సంయుక్తంగా పద్మభూషణ్ అందుకోబోతున్నారు..

12 మెట్ల కిన్నెర కళాకారుడు మొగిలయ్య.. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దర్శనం మొగిలయ్యది నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంట.. 12మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆయన ఆఖరి తరం కళాకారుడు.. పద్మశ్రీ రావడంపై ఆయన స్పందించారు. కిన్నెరమెట్ల కళ అత్యంత అద్భుతమైందన్నారు.. ఈ కళ నాతోనే అంతమవుతుందా అనే మనోవేదనతో ఉన్న సమయంలో.. పద్మశ్రీ పురస్కారం వచ్చిందన్నారు. దీని ద్వారా తన కళకు జీవం పోశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కళను గుర్తించి, పురస్కారాన్ని ఇవ్వడంతో అందరికీ తెలిసిందని చెప్పుకొచ్చారు.

వైవిధ్యమైన ప్రాచీన కళ అయిన పన్నెండు మెట్ల కిన్నెర పలికించే రాగానికి పులకరించిన పద్మశ్రీ పురస్కారం.. మొగిలయ్యను వరించింది. పన్నెండు మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరితరం కళాకారుడు మొగిలయ్యా. కళాకారుడుగా కిన్నెర పాటలతో ప్రతి ఒక్కరిని తన్మయత్వంలో ముంచెత్తుతున్న మొగిలయ్య.. తరాల తెలుగు జీవన విధానం, చారిత్రక గాథలు ఒడిసిపట్టి, పాట రూపంలో కిన్నెర మెట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాద్యం పేరునే ఇంటి పేరుగా మార్చుకుని కిన్నెర మొగిలయ్యగా స్థిరపడ్డారు.

తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనను సర్కారు సత్కరించింది. అంతేకాకుండా ఈ వాద్యం ప్రాశస్త్యాన్ని, మొగిలయ్య ప్రతిభను భావితరాలకు తెలిసేలా ప్రభుత్వం ఎనిమిదో తరగతిలో ఓ పాఠ్యాంశంగా చేర్చింది.కిన్నెరకు కష్టాల రాగాలు..ఈ గుర్తింపుతో మొగిలయ్య మనసైతే సంతసించింది కానీ.. కడుపు నిండలేదు. కళాకారుల పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరవలేదు. ఆసరా పింఛను అడిగితే వయసు చాలదన్నారు. మొగిలయ్య భార్య చనిపోయింది. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేశారు. పెద్ద కొడుకు హైదరాబాద్‌కు వలస వెళ్లి కూలి పని చేసుకుని జీవిస్తున్నాడు. మూడో కుమారుడు పదోతరగతి చదువుతుండగా, రెండో కొడుకు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. అతడి వైద్యానికి నెలకు రూ.4 వేల వరకూ ఖర్చవుతోంది.

వాయిద్య ప్రదర్శనలతో కుటుంబ పోషణ అప్పటి వరకు అక్కడక్కడా వాయిద్య ప్రదర్శనలతో పొట్టపోసుకున్న మొగులయ్యను కరోనా రోడ్డుపైకి లాగింది. ప్రదర్శనలకు అవకాశం లేకపోవడంతో కుటుంబపోషణ కష్టమైంది. దీనావస్థలో ఉన్న తన కుటుంబాన్ని పోషించడానికి గత్యంతరం లేక ఆయన నలుగురినీ యాచించాల్సిన దుస్థితి ఏర్పడింది. పాఠ్యపుస్తకంలో తన గురించి ఉన్న పాఠాన్ని చూపుతూ హైదరాబాద్‌లోని తుక్కుగూడలో భిక్షాటన చేస్తూ కనిపించేవారు మొగిలయ్య. ఆదరణ కోల్పోయిన కళతో భిక్షమెత్తుకుంటున్న కళాకారుడి దుస్థితిని చూసి. .భీమ్లా నాయక్​ చిత్రంలో పాట పాడే అవకాశం దక్కింది.

ఆ తర్వాత మొగిలయ్య పరిస్థితిని తెలుసుకున్న చాలా మంది.. తోచినంతలో ఆర్థికసాయం చేశారు. స్పందించిన ప్రభుత్వం ప్రత్యేకంగా.. కళాకారుల ఫించను రూపంలో.. రూ.10వేల సాయాన్ని అందిస్తోంది. మొగిలయ్య గురించి విన్న పవర్​స్టార్​ పవన్ కల్యాణ్​ ‘భీమ్లా నాయక్’ చిత్రంలో పాట పాడే అవకాశం కల్పించారు. ఇటీవలే విడుదలైన ఈ పాటలో మొగిలయ్య కూడా మనకు కనిపిస్తారు. ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా స్టార్​గా మారిపోయారీ కిన్నెర కళాకారుడు. ప్రముఖ ఛానెళ్లు కూడా ఆయన్ను ఇంటర్వ్యూ చేసేందుకు ముందుకొచ్చాయి. ఆ ఇంటర్వ్యూల్లో కూడా ఆయన తన ఆర్థిక స్థోమత గురించి ప్రస్తావించారు. దీంతో ముందుకొచ్చిన పవన్.. మొగిలయ్యకు రూ.2 లక్షల సాయం అందించారు.

డోలు కళాకారుడు సకిని రామచంద్రయ్య..

Ramachandraiah

Ramachandraiah

కోయదొరల ఇలవేల్పు కథకుడు సకిని రామచంద్రయ్యను పద్మశ్రీ పురస్కారం వరించింది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన ఆయన.. గిరిజన వన దేవతలైన సమ్మక్క-సారలమ్మల జీవిత చరితను డోలు సాయంతో కోయ భాషలో అద్భుతంగా వర్ణిస్తారు. కోయభాషకు అక్షర రూపం తీసుకురావాలని 2015లో ఓ అధికారి సాయంతో తోగుగూడెంలో ఐదుగురు విశ్వవిద్యాలయాల ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సును కూడా నిర్వహించారు..

కూచిపూడి నృత్య కళాకారిణి పద్మజారెడ్డి..

Padmaja Reddy

Padmaja Reddy

కూచిపూడి నృత్య కళాకారిణి గడ్డం పద్మజారెడ్డికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. 1967లో ఏపీలో కృష్ణా జిల్లా పామర్రులో ఆమె జన్మించారు. తండ్రి జీవీరెడ్డి వైద్యుడు, తల్లి స్వరాజ్యలక్ష్మి గృహిణి.. ఆమె నిజామాబాద్‌ మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కేశ్‌పల్లి (గడ్డం) గంగారెడ్డి చిన్నకోడలు.. దేశ విదేశాల్లో ఆమె అనేక ప్రదర్శనలిచ్చారు. నృత్య విశారద, కల్కి కళాకార్‌, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు కూడా అందుకున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సంగీత నాటక అకాడమీ, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న తొలి మహిళా కళాకారిణిగా గుర్తింపు సొంతం చేసుకున్నారు..

కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాకు సంయుక్తంగా పద్మభూషణ్..

Krishna Ella , Suchitra Ella

Krishna Ella , Suchitra Ella

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కాన్సిన్‌-మ్యాడిసన్‌ నుంచి మాలిక్యులార్‌ బయాలజీలో పీహెచ్‌డీ చేసిన కృష్ణ ఎల్లా.. తర్వాత సౌత్‌ కరోలినా మెడికల్‌ యూనివర్సిటీలో రీసెర్చ్‌ ఫ్యాకల్టీగా పనిచేశారు. మానవాళి ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు టీకాలు అభివృద్ధి చేయడమే పరిష్కారమని ఆయన నమ్ముతారు.. ఈ క్రమంలోనే స్వదేశం మీద మక్కువతో కుటుంబంతో సహా వెనక్కి వచ్చారు.. భార్య సుచిత్ర ఎల్లాతో కలిసి 1996లో హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో భారత్‌ బయోటెక్‌ను స్థాపించారు.. హెపటైటిస్‌-బీ టీకాతో మొదలుపెట్టి ఎన్నో వ్యాధులకు టీకాలు ఆవిష్కరించారు. ముఖ్యంగా కరోనా మహమ్మారికి ‘కొవాగ్జిన్‌’ టీకా రూపొందించే క్రమంలో ఆయన చూపిన చొరవ, ప్రభుత్వంతో కలిసి పనిచేసిన తీరు, ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ శాస్త్రవేత్తలతో కలిసి నిర్దిష్ట లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగిన విధానం.. టీకాను వేగంగా ఆవిష్కరించేందుకు దోహదపడ్డాయి. ఈ క్రమంలోనే ఆ దంపతులకు పద్మభూషణ్ అవార్డుకు సంయుక్తంగా ఎంపికయ్యారు.

Read Also…. Buddhadeb Bhattacharjee: పద్మభూషణ్‌ను స్వీకరణకు మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ నిరాకరణ.. ఎందుకో తెలుసా?