Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వాహన కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. లైఫ్ టాక్స్ రేట్లను భారీగా పెంచిన సర్కార్..

Telangana: వాహన కొనుగోలుదారులపై తెలంగాణ సర్కార్ పన్నుల పిడుగు ప్రకటించింది. వాహనాలపై విధించే లైఫ్‌ ట్యాక్స్‌ను(Life tax) పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

Telangana: వాహన కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్.. లైఫ్ టాక్స్ రేట్లను భారీగా పెంచిన సర్కార్..
Life Tax
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 10, 2022 | 11:17 AM

TS Vehicles Life Tax Hike: వాహన కొనుగోలుదారులపై తెలంగాణ సర్కార్ పన్నుల పిడుగు ప్రకటించింది. వాహనాలపై విధించే లైఫ్‌ ట్యాక్స్‌ను(Life tax) పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు సోమవారం(మే 9) నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఇంధన ధరలు ఆకాశాన్ని అంటడంతో అల్లాడుతున్న వాహనదారులకు రవాణా ట్యాక్స్‌‌ల పేరుతో సర్కార్ మరో షాక్ ఇచ్చింది. నాన్‌ ‌ట్రాన్స్‌‌పోర్ట్‌‌ వాహనాలకు(Non Transport Vehicles) లైఫ్‌‌ ట్యాక్స్‌‌ రేట్లను పెంచింది. వాహనాలను శ్లాబ్‌‌లుగా విభజించి వేరువేరుగా రేట్లను ఖరారు చేసింది. ఒక్కో బండిపై 2 శాతం నుంచి 4 శాతం వరకు టాక్స్ పెంచింది. ఈ పెంపు అమలు కోసం మూడు, నాలుగు, ఏడో షెడ్యూల్‌‌లో మార్పులు చేసింది. ఈ మేరకు రవాణా శాఖ స్పెషల్‌‌ చీఫ్‌‌ సెక్రటరీ సునీల్‌‌ శర్మ జీవో జారీ చేశారు.

కొత్త ట్యాక్స్‌‌ల ప్రకారం బండిని బట్టి రూ.3 వేల నుంచి రూ.1.20 లక్షల దాకా అదనంగా వసూలు చేయనున్నారు. పెంచిన ట్యాక్సు‌లతో ప్రభుత్వానికి  ఏటా రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనున్నట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడ్రోజుల్లో కమర్షియల్ వాహనాలపైన కూడా క్వార్టర్లీ ట్యాక్స్‌‌ పెంపు, గ్రీన్‌‌ ట్యాక్స్‌‌ విధించే అవకాశం ఉంది. నాన్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌లో త్రీవీలర్‌‌, ఫోర్‌‌ వీలర్ వాహనాల లైఫ్‌‌ ట్యాక్స్‌‌ ఇప్పటి దాకా రెండు స్లాబులుగా ఉండగా, దాన్ని నాలుగు స్లాబులుగా మార్చింది. కార్లు, జీపులు, ఆటోలు, 10 సీట్ల ఓమ్నీ బస్‌ వంటివి‌ వస్తాయి. ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖరీదైన వాహనాలకు 12 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల ఖరీదైన వాహనాలకు 14 శాతం లైఫ్‌‌ ట్యాక్స్‌‌ వేస్తున్నారు. ఇక నుంచి రూ.5 లక్షల లోపు వాహనాలకు 13 శాతం, రూ.5 నుంచి 10 లక్షల మధ్య వెహికల్స్‌కు 14 శాతం, 10 లక్షల నుంచి 20 లక్షల మధ్య వాహనాలకు 17 శాతం, రూ.20 లక్షల ధర కంటే ఎక్కువగా ఉండే వాటిపై 18 శాతంగా నిర్ణయించారు. అంటే ఒక్కో వాహనంపై సుమారు రూ.10 వేల నుంచి రూ.80 వేల వరకు అదనంగా లైఫ్‌‌ ట్యాక్స్‌‌ భారం పడనుంది.

కంపెనీలు, సొసైటీలు, సంస్థలు సొంతానికి వాడుకునే 10 సీట్ల సామర్థ్యం గల వాహనాలను 4 స్లాబులుగా విభజించారు. ఇప్పటి దాకా ఈ బండ్లకు ఒకటే స్లాబ్ ఉండేది. దానిపై 14 శాతం లైఫ్‌‌ ట్యాక్స్‌‌ వసూలు చేసేది. అయితే.. ఇకపై రూ.5 లక్షలలోపు రేటున్న వాహనానికి 15 శాతం, రూ.5 నుంచి రూ.10 లక్షల వాహనాలకు 16 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ధర ఉన్న వాహనాలకు 19 శాతం, రూ.20 లక్షలకు పైగా రేటు ఉంటే 20 శాతం చొప్పున లైఫ్‌‌ ట్యాక్స్‌‌ వసూలు చేయనున్నారు. అంటే వీటిపై పన్ను రూ.5 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు అదనంగా పెరగనుంది.

ఇవి కూడా చదవండి

ఇక టూవీలర్స్ విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం రెండు స్లాబ్ల విధానాన్ని తీసుకొస్తోంది. దీని ప్రకారం.. రూ. 50 వేల లోపు వాహనాలకు 9 శాతం టాక్స్ వసూలు చేయాలని నిర్ణయించింది. రూ.50 వేలకు పైన ధర ఉండే వాహనాలకు లైఫ్ ట్యాక్స్‌ను 12 శాతానికి పెంచింది. ప్రస్తుతం ఎక్కువ శాతం ద్విచక్రవాహనాల రేట్లు రూ.50 వేలకు పైనే ఉండటంతో ఒక్కో వాహనంపై కొత్తగా కొనేవారికి రూ.3 వేలు అదనపు భారం పడనుంది.

మరిన్ని తెలంగాణ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి..

Interest Rates: వడ్డీ రేట్లలో మార్పులు చేసిన బ్యాంకులు ఇవే.. కస్టమర్లకు పెంపు ఎప్పటి నుంచి అమలవుతుందంటే..

Steel Prices: గృహ నిర్మాణదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న స్టీల్ ధరలు..