Telangana: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. ఈ నెల 22 నుంచి ఆర్టీసీ బస్సులు బంద్..! కారణం ఇదే..
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ఆర్టీసీ జేఏసీ తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె సైరన్ మోగించింది. ఈ నెల 22వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నట్లు నోటీసులు అందించారు. దీంతో ప్రజా రవాణాకు అంతరాయం కలిగే అవకాశముంది. దీంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.

తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్ తగలింది. ఈ నెల 22వ తేదీ నుంచి టీజీఎస్ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ ప్రకటన జారీ చేసింది. దీంతో ఆర్టీసీ బస్సు సర్వీసులు ఆగిపోనుండటంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించనుంది. దీంతో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు సమ్మె చేపడతామని జేఏసీ ప్రకటించింది. దీంతో ఎన్ని రోజులు ఈ సమ్మె జరుగుతుందనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో ఆర్టీసీ బస్సు సేవలకు అంతరాయం కలగనుండటంతో ప్రజలు అవస్థలు పడే అవకాశముంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందనేది చర్చనీయాంశంగా మారింది.
ఫలించని చర్చలు
సోమవారం సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న కార్మికశాఖ కార్యాలయంలో లేబర్ డిపార్ట్‌మెంట్ అధికారులతో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు భేటీ అయ్యారు. తమ డిమాండ్లు, సమ్మె అంశంపై చర్చలు జరిపారు. అనంతరం సమ్మెపై అధికారిక ప్రకటన చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ దిశగా అడుగుల పడలేదు. దీంతో తమను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు వేతనాలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు జేఏసీ ఉంచింది. కార్మిక సంఘాలకు ఎన్నికలు, 30 శాతం ఫిట్‌మెంట్, వేతనాల సవరణ, సర్వీస్ బెనిఫిట్ వంటి వాటిపై ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టారు.
ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు వద్దు
సమ్మె నోటీస్ ఇచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆర్టీసీ జేఏసీ సమ్మె సైరన్ మోగించింది. ఈ నెల 22వ తేదీ నుంచి చేపట్టనున్న సమ్మెకు కార్మికులందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చింది. తమకి న్యాయపరమైన డిమాండ్లు అని, వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడంపై కార్మికులు భగ్గుమంటున్నారు. ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లడం వల్ల ఆర్టీసీ నిర్వీర్యం అయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహిస్తే మంచిదని సూచిస్తున్నారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద ఇచ్చే సబ్సిడీలో ఎలాంటి కోతలు పెట్టకుండా విడుదల చేయాలని ఆర్టీసీ జేఏసీ కోరుతోంది.
