MLC Elections 2021: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో ఏకగ్రీవాల జోరు.. మరోసారి గులాబీదే హవా!

తెలంగాణ శాసనమండలిలోని 12 స్థానిక సంస్థల కోటా స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేకుండాపోయింది.

MLC Elections 2021: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో ఏకగ్రీవాల జోరు.. మరోసారి గులాబీదే హవా!
Kcr
Follow us

|

Updated on: Nov 25, 2021 | 7:56 PM

Telangana Localbody MLC Elections 2021: తెలంగాణ శాసనమండలిలోని 12 స్థానిక సంస్థల కోటా స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేకుండాపోయింది. నేటితో నామినేషన్ల ఉపసంహర గడువు ముగియడంతో పలువురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో పలు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఇప్పటికే 9 చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. బుధవారం జరిగిన నామినేషన్ల స్క్రూటినీ అనంతరం నిజామాబాద్‌ జిల్లాలోని ఒక స్థానంలో కల్వకుంట్ల కవిత.. రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు ఇద్దరే బరిలో మిగిలారు. వీరి ఎన్నిక దాదాపు ఖరారైనా.. ఈ నెల 26న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక అధికారికంగా ప్రకటించనున్నారు.

తెలంగాణలోని హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాల్లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తొమ్మిది ఉమ్మడి జిల్లాలని పన్నెండు స్థానాలకు టీఆర్ఎస్ సభ్యులు నామినేషన్ ధాఖలు చేశారు. వీరితో పాటు ఖమ్మం , మెదక్ జిల్లాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయగా మొత్తం 100పైగా ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్స్ స్క్రూటినిలో ఎక్కువగా తిరస్కరించగా మరికొన్ని చోట్ల ఇవాళ చివరి రోజు కావడంతో అభ్యర్థులే విత్ డ్రా చేసుకున్నారు. ఈ సంధర్భలోనే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇండిపెండెంట్ అభ్యర్థి కొటగిరి శ్రీనివాస రావు నామినేషన్‌ను బలపరిచిన ఇద్దరు అభ్యర్థులు తమ సంతకాలు పోర్జరీ చేశారన్న ఆరోపణ చేయడంతో ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్ రద్దు చేశారు. దీంతో ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం అయ్యారు.

మరోవైపు వరంగల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వరంగల్ స్థానానికి 13 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్స్ వేయగా అందులో పదిమంది అభ్యర్ధుల నామినేషన్స్‌ నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయంటూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్క్రూటినిలో రద్దు చేశారు. ఇక, మిగిలిన ముగ్గురు అభ్యర్ధులు కూడా ఇవాళ తమ నామినేషన్స్‌ను విత్ ‌డ్రా చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవం ఖాయమైంది. అటు, మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. జిల్లాలోని రెండు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి చేరాయి. స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీశైలం వెనక్కి తగ్గారు. నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి రాతపూర్వకంగా తెలిపారు. దీంతో ఆ జిల్లా నుంచి బరిలో దిగిన టీఆర్ఎస్ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాత్రమే పోటీలో మిగిలారు. ఈ రెండు స్థానాలకు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇక, రంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలోనూ బరిలో ఎవరూ నిలవకపోవడంతో రెండు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి చేరాయి. ప్రస్తుతం శాసన మండలి సభ్యులుగా ఉన్న శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి మరోసారి నామినేషన్లు వేయగా, వారికి పోటీ ఎవరూ బరిలోకి దిగకపోవడంతో.. అభ్యర్థులిద్దరే పోటీలో నిలిచారు. వీరి ఎన్నికను నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలావుంటే, రంగారెడ్డి ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన తమను అధికార పార్టీ నేతలు అడ్డుకుని, నామినేషన్‌ పత్రాలను చించేశారంటూ.. పంచాయతీరాజ్‌ చాంబర్స్‌ ఫోరం అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, చింపుల శైలజారెడ్డి బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్, రిటర్నింగ్‌ అధికారి అమయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి ‘స్థానిక’ ఎన్నికను రద్దు చేయాలని.. తిరిగి నోటిఫికేషన్‌ ఇచ్చి, తమకు పోటీ అవకాశం కల్పించాలని కోరారు. ఈ అంశంపై హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. కాగా, ఏకగ్రీవాలు ఖాయమైన స్థానాలుపోగా.. మిగతా రెండు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెదక్‌లో నిర్మల జగ్గారెడ్డి, ఖమ్మంలో రాయల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

Read Also… AP Floods: రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం..