Telangana: తల్లి హత్య కేసులో కొడుకు బతుకు బుగ్గిపాలు.. జీవితకాలం ఆలస్యంగా దొరికిన న్యాయం

ఆలస్యంగా దొరికిన న్యాయం.. అన్యాయంతో సమానం అంటారు. కానీ ఈ వ్యక్తి జీవితంలో అది ఓ జీవిత కాలం ఆలస్యమైంది. కోర్టుల్లో తరగని పెండింగ్‌ కేసులు అతని జీవితాన్ని కాలరాశాయి. తల్లి హత్య కేసులో జైలు కెళ్లిన ఓ వ్యక్తికి సకాలంలో న్యాయం అంద లేదు. క్రిమినల్‌ కేసులు, బెయిలు పిటిషన్లతో చోటు చేసుకున్న జాప్యంతో న్యాయం దక్కేలోపే ఆతని ఆయువు జైలు గోడల మధ్య తీరిపోయింది..

Telangana: తల్లి హత్య కేసులో కొడుకు బతుకు బుగ్గిపాలు.. జీవితకాలం ఆలస్యంగా దొరికిన న్యాయం
HC acquits murder case convict
Follow us

| Edited By: Srilakshmi C

Updated on: Aug 05, 2024 | 12:01 PM

సిద్దిపేట, ఆగస్టు 5: ఆలస్యంగా దొరికిన న్యాయం.. అన్యాయంతో సమానం అంటారు. కానీ ఈ వ్యక్తి జీవితంలో అది ఓ జీవిత కాలం ఆలస్యమైంది. కోర్టుల్లో తరగని పెండింగ్‌ కేసులు అతని జీవితాన్ని కాలరాశాయి. తల్లి హత్య కేసులో జైలు కెళ్లిన ఓ వ్యక్తికి సకాలంలో న్యాయం అంద లేదు. క్రిమినల్‌ కేసులు, బెయిలు పిటిషన్లతో చోటు చేసుకున్న జాప్యంతో న్యాయం దక్కేలోపే ఆతని ఆయువు జైలు గోడల మధ్య తీరిపోయింది. వివరాల్లోకెళ్తే.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన పెద్దగుండెల అలియాస్‌ గుండెల పోచయ్య తన తల్లి ఎల్లవ్వను హత్య చేశాడనే నేరంపై 2013 ఫిబ్రవరి 1వ తేదీన అరెస్టయ్యాడు. వృద్ధురాలైన తల్లిని పోషించలేక చెట్టుకు టవల్‌తో ఉరి వేసి, ఆమెను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈకేసులో సిద్దిపేట కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి 2015 జనవరి 12న పోచయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో అతన్ని చర్లపల్లి సెంట్రల్‌ జైలుకు తరలించారు. అదే ఏడాది పోచయ్య తరఫున ఆయన చిన్న కుమారుడు దేవయ్య అలియాస్‌ దావిద్‌ హైకోర్టులో అప్పీలు చేశాడు. ఈ సమయంలో బెయిలు పిటిషన్‌ కూడా దాఖలు చేయగా హైకోర్టు కొట్టివేసింది.

ఈ ఏడాది జులైలో ఈ అప్పీలును విచారించిన హైకోర్టు పోచయ్యను నిర్దోషిగా తేల్చి, తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న పోచయ్య ఆరేళ్ల క్రితమే జైలులోనే చనిపోయినట్లు తెలుసుకున్న జడ్జి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. చర్లపల్లి ఓపెన్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న పోచయ్య 2018 ఆగస్టు 15న అనారోగ్యానికి గురికాగా పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆగస్టు16న కుటుంబసభ్యులు జైలుకు చేరుకుని ఆరా తీయగా.. ఆయన అప్పటికే మృతిచెందినట్లు జైలు సిబ్బంది తెలిపారు. జైలు అధికారులు నిర్లక్ష్యం కారణంగానే పోచయ్య మృతి చెందినట్లు చిన్న కుమారుడు దావిద్‌ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పదేళ్లకు పైబడిన కేసులను పరిష్కరించాలన్న లక్ష్యంతో ఇటీవల హైకోర్టు ప్రత్యేక విచారణ చేపట్టగా.. ఇందులో భాగంగా పోచయ్య అప్పీలును విచారించింది. ఈ కేసులో పోచయ్యకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లేకపోవడంతో కేవలం వైద్యుడు, దర్యాప్తు అధికారి సాక్ష్యాల ఆధారంగా కింది కోర్టు శిక్ష విధించడం సరికాదంటూ కేసును కొట్టి వేసింది. అయితే జైలులో ఖైదీ చనిపోతే సాధారణంగా ఆ సమాచారాన్ని జైలు అధికారులు సెషన్స్‌ కోర్టుకు అందజేస్తారు. ఒకవేళ ఖైదీ అప్పీలు పెండింగ్‌లో ఉంటే హైకోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు తెలియజేయాలి. కానీ పోచయ్య విషయంలో ఇదేమీ జరగలేదు. కేసు విచారణ సమయంలో అప్పీలుదారు మృతిచెందితే ఈ కేసు విచారణను హైకోర్టు మూసివేస్తుంది. అయితే పోచయ్య మరణించడంతో ఇటు జైలు అధికారులుగానీ, అటు కుటుంబసభ్యులు గానీ పట్టించుకోలేదు. పైగా వారు ఏర్పాటు చేసుకున్న లాయర్‌ కూడా మృతి చెందాడు. పోచయ్య మృతిపై హైకోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు ఎలాంటి సమాచారం అందకపోవడంతో ఇటీవల వాదనలు వినిపించి, 2024 జులై 25న తీర్పు వెలువరించారు. 11 ఏళ్లకు బాధితుడికి న్యాయం దక్కిందని అంతా భావించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు మృతుడు పోచయ్య ఓపెన్‌ ఎయిర్‌ జైల్లో చేసిన కూలి పనుల తాలూకు డబ్బు కూడా తమకు అందలేదని కుమారుడు దావిద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో పోచయ్యకు సుమారు రూ.20 వేలు రావాల్సి ఉండగా, జైలు అధికారులు ఆయన పేరుతో మనీఆర్డరు పంపారు. కానీ చనిపోయిన వ్యక్తి పేరుతో వచ్చిన సొమ్మును ఇవ్వలేమంటూ పోస్టాఫీసు అధికారులు వెనక్కి పంపారు. ఇలా.. ఓ నిరుపేద జీవితం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అతీగతీ లేకుండా పోయింది. వెలుగులోకిరాని ఇలాంటి ఎన్ని కేసులు కోర్టుల్లో మగ్గుతున్నాయో.. కళ్లు మూసుకున్న ఆ న్యాయదేవతకే తెలియాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.