Heli-Tourism: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి నుంచి హెలికాప్టర్ సేవలు.. పూర్తి వివరాలు ఇవే
తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త ఉత్సాహం రానుంది. రాష్ట్ర ప్రభుత్వం హెలీ టూరిజానికి శ్రీకారం చుట్టింది. మొదటి దశలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభించేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే సంక్రాంతి నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త ఉత్సాహం రానుంది. రాష్ట్ర ప్రభుత్వం హెలీ టూరిజానికి శ్రీకారం చుట్టింది. మొదటి దశలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభించేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే పర్యాటక శాఖ ప్రైవేట్ భాగస్వామ్యంతో కలిసి హెలికాప్టర్ సేవలను ప్రారంభించనుంది. ‘ఈజ్ మై ట్రిప్’ వంటి ప్రముఖ సంస్థలతో చర్చలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. మొదట వారాంతాల్లో సేవలు నడిపి, ప్రజల ఆదరణ బట్టి సేవలను విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగానికి కొత్త రూపురేఖలు రానున్నాయని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ టూ శ్రీశైలంగా వయా నల్లమల
ఈ సేవలు హైదరాబాద్- శ్రీశైలం మధ్య అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ నల్లమల అడవులు, సోమశిల, అమరగిరి వంటి ప్రాంతాల అందాలను పై నుంచి చూపిస్తూ శ్రీశైలం చేరుకునేలా రూట్ ప్లాన్ సిద్ధం చేశారు. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నందున, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లనున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ఐదు నుంచి ఆరు గంటలు పడుతోంది. అయితే హెలికాప్టర్ ద్వారా ప్రయాణిస్తే కేవలం గంటలోపే గమ్యం చేరుకోవచ్చు. దీంతో ఉద్యోగులు, కుటుంబాలు, అంతర్జాతీయ పర్యాటకులు వీకెండ్ ట్రిప్‌లకు సౌకర్యవంతంగా ఈ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
ఒక్కో ట్రిప్ కు ఆరుగురు నుండి 8 మంది
ఒక్కో హెలికాప్టర్లో ఆరుగురు నుంచి ఎనిమిది మంది ప్రయాణించే సీటింగ్ సామర్థ్యం ఉంటుంది. పర్యాటక శాఖ ఈ టూర్‌ను రెండు నుంచి మూడు రోజుల ప్యాకేజీ రూపంలో రూపొందిస్తోంది. ఇందులో ప్రయాణం, దర్శనం, వసతి వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి. త్వరలోనే టికెట్ ధరలు ఖరారు చేసి, బుకింగ్‌ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్‌ను ప్రారంభించనుంది.
హెలీ టూరిజం విజయవంతమైతే, రెండవ దశలో వరంగల్, ములుగు జిల్లాల్లోని రామప్ప ఆలయం, లక్నవరం సరస్సు వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు కూడా హెలికాప్టర్ సర్వీసులను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో తెలంగాణ పర్యాటకం దేశ పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి నాటికి ప్రారంభమయ్యే ఈ హెలీ టూరిజం ప్రాజెక్ట్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




