AIIMS Report: కరోనా వ్యాక్సిన్ కాదు.. యువత ఆకస్మిక మరణాలకు కారణమేంటో తేల్చేసిన ఎయిమ్స్!
ఈ మధ్య కాలంలో యువత నడివయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. కండలు తిరిగిన శరీరాలను కూడా అకాల మరణాలు కబళిస్తున్నాయి. ఈ సడెన్ డెత్స్‌కు ప్రధాన కారణం కరోనా, కరోనా వ్యాక్సినే అనే ప్రచారం గత కొంత కాలంగా జోరుగా జరుగుతుంది. కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) తన పరిశోధనలో ఈ మరణాలకు సంబంధించి భయంకరమైన నిజాలను బయటపెట్టింది. ఇంతకీ ఆ రిపోర్ట్ లో ఏముంది ? ఎయిమ్స్ వైద్యుల పరిశీలనలో గుర్తించిన అంశాలేంటీ? నిజంగా కరోనా వల్లే ఇన్ని సడెన్ డెత్స్ జరిగాయా? తెలుసుకుందాం పదండి.

ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఆకస్మిక మరణాలపై కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. జీవన ప్రయాణం అర్థాంతరంగా ముగిసిపోవడానికి అసలు కారణాలు ఏంటో ఢిల్లీలోని ఎయిమ్స్ తేల్చేసింది. 2018 నుంచి 2022 మధ్య జరిగిన 3,800కి పైగా అకాల మరణాలపై ఎయిమ్స్ అధ్యయనం చేసింది. వారిలో 45 ఏళ్ల లోపు మరణించిన వారిలో దాదాపు సగం మంది చావుకు ప్రధాన కారణం గుండె సంబంధిత వ్యాధులేనని కుండా బద్దలుకొట్టింది. ఇన్ని రోజులు ప్రజల్లో ఉన్న అపోహలన్నీ అబద్ధమని తేల్చింది. గుండె సంబంధిత వ్యాధులతో 42.6%, ఊపిరితిత్తుల సంబంధిత ఇన్ఫెక్షన్స్ తో 21.5%, ఇతర కారణాల తో 35.9% మంది చనిపోయారని తేల్చింది. వీరందరి చావుకి కోవిడ్ అసలు కారణమే కాదని రిపోర్ట్ ఇచ్చింది.
ఒకప్పుడు వృద్ధాప్య సమస్య అనుకున్న గుండె జబ్బులు ఇప్పుడు యంగ్ ఇండియాను దహించివేస్తున్నాయి. మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుత లైఫ్‌స్టైలే అంటున్నారు వైద్యులు. అవును మారుతున్న లైఫ్‌స్టైల్, సిగరెట్, మద్యం, స్ట్రెస్, నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్ ఇవన్నీ యూత్ ను రిస్క్ ఫ్యాక్టర్ లోకి దించుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. 2018 నుంచి 2022 మధ్యలో మరణించిన యువతలో 57 శాతం స్మోకింగ్, 52 శాతం ఆల్కహల్ సేవించే వారు ఉన్నట్లు ఎయిమ్స్ పరిశోధనలో తేలింది. ఉరుకులు పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు అదుపు తప్పాయనీ, వ్యాయామం వదిలేశారని.. అందుకే గుండె నిట్టూరుస్తోందంటున్నారు.ఈ అజాగ్రత్తే గుండెపోటును ఆహ్వానిస్తోంది అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
గుండె జబ్బులను చిన్న చూపు చూడొద్దనీ, లక్షణాలు లేవని లైట్ తీసుకోవద్దనీ, సిగరెట్,ఆల్కహాల్ అలవాటును మానేసి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండని వైద్యుల సలహా ఇస్తున్నారు. ఐతే ఇప్పుడు 18-44 ఏళ్ల మధ్య వయసు వారే సడెన్ డెత్స్ తో చనిపోతున్నారని.. పిల్లల లైఫ్ స్టైల్ లో మార్పు రాకపోతే చిన్నారుల్లో కూడా ఈ సడెన్ డెత్స్ జరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కాబట్టి పిల్లలకు ఇప్పటి నుంచే వ్యాయామంతో మైండ్ బాడీని మేల్కొల్సేలా చేయమని చెబుతున్నారు ,స్క్రీన్ టైమ్ తగ్గించి ఫిజికల్ యాక్టివిటీ పై దృష్టి పెట్టాలని తల్లి తండ్రుల కు వైద్యులు సూచిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కార్డియాక్ స్క్రీనింగ్ చేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఛాతీలో నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని ముఖ్యంగా.. ఒత్తిడిని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.
AIIMS అధ్యయనం ఒక ఘాటైన హెచ్చరిక.. మీ గుండె బలమైన గోడలా నిలబడాలంటే, మీ జీవనశైలిని మార్చుకోవాలి అని వైద్యులు సలహా ఇస్తున్నారు .ఈ గుండె చప్పుడు ఆగకూడదు. జాగ్రత్త పడండి, ఆరోగ్యంగా ఉండండి. లేకపోతే మృత్యు ఘంటికలు వినిపించడం ఖాయం అని హెచ్చరిస్తుంది తాజా ఎయిమ్స్ రిపోర్ట్.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




