Petrol Bunks Exempted: వాహనదారులకు శుభవార్త.. లాక్‌డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు ఇచ్చిన రాష్ట్ర సర్కార్
రాష్ట్రంలో అన్ని పెట్రోల్ బంకులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది తెలంగాణ సర్కార్.
Petrol Bunks Exempted from Lockdown: రాష్ట్రంలో అన్ని పెట్రోల్ బంకులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది సర్కార్. ఇప్పటివరకు హైవేలపై ఉన్న బంకులు మాత్రమే తెరిచి ఉన్నాయి. ఇక, వివిధ జిల్లలోని రూరల్, అర్బన్ ఏరియాల్లోని బంకులు కేవలం లాక్ డౌన్ రిలాక్సేషన్ టైంలోనే నడుస్తున్నాయి. ధాన్యం తరలింపు, ఎమర్జెన్సీ వాహనాలకు పెట్రోల్, డీజిల్ అవసరమవుతుండటంతో.. ప్రభుత్వం పెట్రోల్ బంకులను లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇకపై అన్ని ఏరియాల్లోని పెట్రోల్ బంకులు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా మహమ్మారి రాష్ట్రవ్యాప్తంగా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రెండో విడతలో పట్టణాల నుంచి పల్లెలకు పాకింది. దీంతో వైరస్ కట్టడిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి, నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. ఈనెల 30వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. వర్తక, వాణిజ్య సంస్థలతో పాటు పెట్రోల్ బంకులు సైతం మూతపడ్డాయి. దీంతో రవాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అయితే, రాష్ట్రంలో వరి కోతల సమయం ఉండటం, పల్లెల్లో అత్యవసర పరిస్థితుల్లో రవాణ వ్యవస్థలు లేక జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.
ముఖ్యంగా రైతులు ధాన్యం కోసేందుకు, మార్కెట్‌కు తరలించేందుకు వాహనాలు లేక అష్టకష్టాలు పడుతున్నారు. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో అన్ని ఏరియాల్లోని పెట్రోల్ బంకులను తెరిచేందుకు వీలు కల్పించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.