Telangana: వైఎస్.షర్మిలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్.. జగన్ పై కూడా.. ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు..
గత కొద్దిరోజులుగా టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా విమర్శలు చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉంటే..
Telangana: గత కొద్దిరోజులుగా టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా విమర్శలు చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉంటే నీకెందుకు అంటూ షర్మిలపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని గా చూడాలనే ది వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆఖరి కోరిక అని అన్నారు. తండ్రి అడుగు జాడల్లో మీరు నడుస్తున్నారా అంటూ ప్రశ్నలు సంధించారు జగ్గారెడ్డి. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా జగన్, షర్మిల ఇద్దరు తండ్రి ఆశయాలు నెరవేర్చుతున్నారా అంటూ అడిగారు. ఆస్తుల విషయంలోనూ, వై ఎస్.రాజశేఖర్ రెడ్డికి శ్రద్ధాంజలి సమయంలో జగన్, షర్మిల లు కలిసే ఉంటారు. రాజకీయం వచ్చే సరికి ఇద్దరు వేరు వేరు అంటున్నాంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. జగన్ అన్న వదిలిన బాణం అని అప్పట్లో పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు వైఎస్.రాజశేఖర్ రెడ్డి వదిలిన బాణం అంటున్నారని.. ఇప్పుడు జగన్ వదిలేసిన బాణం అయ్యిందంటూ ఎద్దెవా చేశారు. జగ్గారెడ్డి ఏ పార్టీ లో ఉంటే నీకెందుకంటూ షర్మిలపై మండిపడ్డారు. తాను ఎక్కడ తిరిగితే నీకెందుకు.. జగ్గారెడ్డి ఏ పార్టీ లో ఉన్నాడో తెలివి ఉన్న వాళ్ళందరికీ తెలుసంటూ షర్మిల వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు.
తాను పార్టీలు మార్చిన చరిత్ర అంతా తన ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చారు. వైఎస్. షర్మిల మమ్మల్ని తిడితే.. తాము వై ఎస్.రాజశేఖర్ రెడ్డిని తిట్టాల్సి వస్తుందని, మమ్మల్ని గెలుకుడు ఎందుకంటూ షర్మిలకు హితవు పలికారు జగ్గారెడ్డి. టీఆర్ ఎస్ లో పని చేసుకుంటూ ఉన్న తనను పిలిచింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు. ఆ సంగతి నీకు తెలియదా.. తన క్యారెక్టర్ కరాబు చేసింది వైఎస్.రాజశేఖర్ రెడ్డే అన్నారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఏం చేశారనేది తెలుసుకోకుండా షర్మిల మాట్లాడుతోందన్నారు.
వైఎస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు తాను ఎంతో కన్నింటి పర్వంతమయ్యానని, సొంత నాన్న చనిపోతే కూడా అంతగా ఏడ్వలేదన్నారు జగ్గారెడ్డి. వైఎస్.రాజశేఖర్ రెడ్డి చనిపోతే తాము బయట ఏడుస్తుంటే.. ఎవరు సీఏం కావాలంటూ ఇంట్లో స్కెచ్ వేసుకున్నారని షర్మిలపై జగ్గారెడ్డి మండిపడ్డారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి మీద తన లాంటి వాళ్లకు ప్రేమ ఉందని, ఆప్రేమ మీకు లేదంటూ షర్మిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వాళ్లలో తాను ఒక్కడిననిచ అలాంటి తనతో వైఎస్.రాజశేఖర్ రెడ్డి లోపాలు ఎత్తిచూపించేలా చేసింది మీరేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.
వైఎస్.రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వాళ్లతోనే ఆయనను తిట్టించేలా చేసిది షర్మిలనే అంటూ జగ్గారెడ్డి తెలిపారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి సైతం పార్టీ మారాంటూ.. ఈవిషయం షర్మిలకు తెలియదా అంటూ ప్రశ్నించారు. 1978లో రెడ్డి కాంగ్రెస్ లో ఎమ్మెల్యే గా గెలిచారు కదా.. రెడ్డి కాంగ్రెస్ నుండి మళ్ళీ కాంగ్రెస్ లోకి రాలేదా.. ఈ విషయం షర్మిలకు తెలియదేమో అంటూ ఎద్దెవా చేశారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి అభిమానిని అయినప్పటికి తన వ్యక్తిత్వం చెడగొట్టే పనిచేస్తే మాత్రం ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు. షర్మిల బీజేపీ వదిలిన బాణం అనే అనుమానం తనకు ఉందని అన్నానని.. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే తాను వైఎస్.రాజశేఖర్ రెడ్డి వదిలిన బాణం అంటే బాగుండేదని, అప్పుడు జగన్ అన్న వదిలిన బాణం అన్నావు. నువ్వే బాణాలు మార్చంగ, మమల్ని ఎందుకు అనడం, ఎవరిని తిట్టాలి… ఎలా టిట్టాలి అనేది ముందు నేర్చుకో అంటూ షర్మిలకు జగ్గారెడ్డి హితవు పలికారు.
వైఎస్.రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయితే మమల్ని తిడితే ఊరుకుంటామా.. తండ్రి బాటలో నడిస్తే గౌరవించే వాళ్లం అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. షర్మిల బీజేపీని విమర్శించడం ఇప్పటివరకు చూడలేదని, ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు షర్మిల ప్రశ్నించడం లేదన్నారు. షర్మిల బీజేపీ వదిలిన బాణమే, జగన్ బీజేపీ మనిషే కదా. హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కి పోకుండా అడ్డుకునే పనిలో షర్మిల ఉన్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. జగన్, షర్మిల ఇద్దరూ బీజేపీ డైరెక్షన్ లోనే పని చేస్తున్నారని, షర్మిల, జగన్..గ్యాస్..పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగాయి అని ఎప్పుడైనా అడిగారా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. షర్మిల టీఆర్ ఎస్ నాయకులను తిడుతుంటే…వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో తనకు తెలియడం లేదన్నారు. విజయమ్మ కూడా బీజేపీ డైరెక్షన్ లోనే ఉన్నారని, జగన్, షర్మిల, విజయమ్మ బాణాలు అన్ని బీజేపీ వే అంటూ జగ్గారెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుడదనేది బీజేపీ స్కెచ్ అని, అందులో భాగమే వీళ్లంతా అని తీవ్ర ఆరోపణలు చేశారు. షర్మిల తన ఇంటి పరువు తానే తీసుకుంటుందని విమర్శించారు.
ఏపీ రాజకీయాలపై: విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడంపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. అలాగే రాజధాని అమరావతి విషయంపై కూడా మాట్లాడారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసి, వైఎస్.రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం జగన్ చేసిన తప్పేనని అన్నారు. తెలుగు ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తి ఎన్టీఆర్ అని, వివాదాలతో పేరు పెడితే వైఎస్.రాజశేఖర్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ఎన్టీఆర్ దగ్గర పనిచేసిన వాళ్లే వైసీపీలో ఉన్నారు కదా అని అన్నారు జగ్గారెడ్డి. ఎన్టీఆర్ పార్టీలో పెరిగి ఎమ్మెల్యే అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారని అన్నారు. వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫ్యాక్షన్ స్టైల్ లో ఉంటే ఎట్లా.. పదవులు శాశ్వతం కాదు.. పదవి నుండి దిగిపోయిన తర్వాత తెలుస్తుంది అసలు విషయం అంటూ ఏపీ సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై కూడా మండిపడ్డారు జగ్గారెడ్డి.
అమరావతిపై: ఆంధ్రప్రదేశ్ కు అమరావతినే రాజధానిగా ఉండాలన్నారు. అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు మంచి నిర్ణయం తీసుకున్నారని, చంద్రబాబు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, కాంగ్రెస్ పార్టీలో మంత్రి నే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..