Telangana Bjp: టార్గెట్ 2023.. హన్మకొండ వేదికగా నేడు బీజేపీ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న నడ్డా సహా కీలక నేతలు

Shaik Madarsaheb

Shaik Madarsaheb | Edited By: Phani CH

Updated on: Aug 27, 2022 | 11:34 AM

హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీలో నిర్వహించతలపెట్టిన బీజేపీ సభకు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఓరుగల్లులో భారీ సభ నిర్వహించాలనుకున్న కమలనాథులకు ప్రిన్సిపాల్‌ బ్రేక్‌ వేశారు.

Telangana Bjp: టార్గెట్ 2023.. హన్మకొండ వేదికగా నేడు బీజేపీ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న నడ్డా సహా కీలక నేతలు
Bjp


Bjp Warangal Sabha: టార్గెట్‌ తెలంగాణ. ఇదీ కమలనాథుల 2023 ఫార్మూలా. ఈ క్రమంలో రాజకీయంగా ఎన్నో ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ ఇవాళ హనుమకొండలో బహిరంగ సభకు సిద్ధమైంది. జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరవుతున్న సభను విజయవంతం చేసి.. తమ సత్తా చాటాలనుకుంటున్నారు కమలనాథులు. నడ్డా తెలంగాణ టూర్‌లో సినీ గ్లామర్‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతుంది.

హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీలో నిర్వహించతలపెట్టిన బీజేపీ సభకు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఓరుగల్లులో భారీ సభ నిర్వహించాలనుకున్న కమలనాథులకు ప్రిన్సిపాల్‌ బ్రేక్‌ వేశారు. తెల్లారే సరికి హైకోర్టు తలుపుతట్టిన బీజేపీ నేతలు కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. హనుమకొండ సభకు అనుమతివ్వాలంటూ వరంగల్ సిపి తరుణ్ జోషికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. సీపీ ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని సూచించింది. అయితే నిర్దేశించిన సమయంలోనే సభను పూర్తి చేయాలని చెప్పింది కోర్టు. సభలో ఎక్కడ మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఉండకూడదు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సభను పూర్తి చేయాలి. విద్యార్థుల పరీక్షలు దృష్టిలో ఉంచుకొని సభ నిర్వహించాలంటూ కోర్టు ఆదేశించింది. ఆర్ట్స్ కాలేజీ సభకు కోర్టు నుంచి అనుమతి రావడం కాషాయ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప దెబ్బలాంటిదన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పాదయాత్రతోపాటు వరంగల్‌ సభను జరగనీయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం కుట్రలు చేసిందని ఆరోపించారు.

తెలంగాణ ఇంచార్జ్‌ బాధ్యతలు తీసుకున్న సునీల్‌ బన్సల్‌ హైదరాబాద్‌ వచ్చి రాగానే నేరుగా వరంగల్ పయనం అయ్యారు. అక్కడ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సునీల్‌ బన్సల్‌ తాజాగా తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ నేత. తెలంగాణను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో చెప్పడానికి బన్సల్ నియామకమే నిదర్శనం. బూత్‌స్థాయి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక వరకు పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెట్టి, పార్టీకి విజయాన్ని అందించడంలో బన్సల్‌ను దిట్టగా చెబుతుంది బీజేపీ. ఆయనను హీరో ఆఫ్‌ ది బ్యాటిల్ గ్రౌండ్‌గా బీజేపీ నేతలు చెబుతూ ఉంటారు. ఆయనను ఇప్పుడు తెలంగాణకు బాధ్యుడ్ని చేసింది బీజేపీ. అందులో భాగంగానే మునుగోడు పోరుకు ముందు జరుగుతున్న నడ్డా మీటింగ్‌పై ఫోకస్‌ పెట్టేందుకు తెలంగాణకు చేరుకున్నారు బన్సల్

ఇవాళ జరిగే సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడుజేపీ నడ్డా హాజరుకాబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సతీ సమేతంగా హైదరాబాద్‌లో ల్యాండ్ కాబోతున్నారు నడ్డా. పార్టీ ముఖ్యనేతలతో భేటీ అనంతరం క్రికెటర్‌ మిథాలీరాజ్‌తో సమావేశం జరగనుంది. ఆ భేటీ తర్వాత హెలీకాఫ్టర్‌లో నేరుగా వరంగల్‌ వెళ్తారు. అక్కడ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం 6 గంటలకు సభకు హాజరవుతారు. అనంతరం హెలీకాఫ్టర్లో హైదరాబాద్‌ చేరుకుంటారు. నడ్డా టూర్‌లో ఆసక్తికర అంశం ఏంటంటే.. టాలీవుడ్‌ హీరో నితిన్‌తో భేటీ కాబోతున్నారు. శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో నితిన్‌-నడ్డాల సమావేశం జరగబోతోంది. ఈ భేటీపై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కొందరు సినీ రచయితలతోనూ నడ్డా సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలు టాలీవుడ్‌ స్టార్స్‌తో భేటీ అవుతుండడం ఆసక్తి రేపుతోంది. ఈనెల 21న హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో సమావేశమయ్యారు. నోవాటెల్‌ హోటల్‌లోనే వీరిద్దరి మధ్య అరగంటకు పైగా భేటీ జరిగింది. అయితే వారి సమావేశ వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇప్పుడు నడ్డా సైతం తెలంగాణ పర్యటనలో సినీ తారాగణంతో భేటీ అవుతుండటం ఆసక్తి రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu