Telangana Assembly: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. దేశాన్ని ప్రపంచంతో పోటీపడేలా చేసిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అంటూ కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ ప్రధాని మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరిచిపోలేనిదన్నారు. ఆయన చేసిన సేవలు గుర్తుండేలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ అసెంబ్లీ ఘన నివాళులు అర్పించారు.. ఈనెల 26న కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించేందుకు తెలంగాణ అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది.. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను సభ గుర్తు చేసుకుంది. మన్మోహన్ తీసుకువచ్చిన కొన్ని చట్టాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతోపాటు.. నీతి, నిజాయితీ గల నాయకుడు అంటూ ప్రశసించింది.. తెలంగాణ అసెంబ్లీ ప్రతేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.. మాజీ ప్రధాని మన్మోహన్‌కు తెలంగాణ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.. ఆయనకు సంతాపం తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌కు భారత రత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు తెలపింది.
ఈ సంరద్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని ప్రపంచంతో పోటీపడేలా చేసిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అంటూ కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ ప్రధాని మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరిచిపోలేనిదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలు గుర్తుండేలా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. సభ్యుల సూచన మేరకు అవసరమైతే మరో చోటకు మారుస్తామంటూ పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టం, RTI చట్టం మన్మోహన్ సింగ్ ఘనత అని ప్రశంసించారు. అందరికి ఆధార్ మన్మోహన్ హయాంలోనే మొదలైందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఆయన హయాంలో ఆమోదం పొందిందన్న సీఎం.. తెలంగాణ ప్రజలు మన్మోహన్‌కు రుణపడి ఉంటారని అన్నారు.
ఆ ఘనత మన్మోహన్‌కే దక్కుతుంది.. భట్టి విక్రమార్క
అందరికి ఆహార భద్రత చట్టం తీసుకువచ్చిన ఘనత మాజీ ప్రధాని మన్మోహన్‌కే దక్కుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం దేశంలో ఎంతో మార్పు తీసుకువచ్చిందన్న భట్టి.. కరోనా సమయంలో ఉపాధి హామీ గ్రామీణులను ఆదుకుందని అన్నారు. భూమి లేని వారికి అటవీ హక్కుల చట్టం భరోసానిచ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు.
బీఆర్ఎస్ మద్దతు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ అసెంబ్లీలో మన్మోహన్‌కు సంతాపం తెలుపుతూ సీఎం రేవంత్ ప్రవేశపెట్టిన తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. మన్మోహన్‌కు భారత రత్న ఇవ్వాలన్న తీర్మానానికి మద్దతు ఇస్తూనే ఢిల్లీలో పీవీ నరసింహా రావు మెమొరియల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాలన్నారు కేటీఆర్. భారతరత్న పురస్కారానికి మన్మోహన్ పూర్తిగా అర్హులని.. నీతి, నిజాయితీ గల నాయకుడు మన్మోహన్‌సింగ్ అంటూ పేర్కొన్నారు. డా.మన్మోహన్ సింగ్ నిరాడంబర మనిషి అని.. మన్మోహన్ సింగ్ ప్రతిభను గుర్తించింది తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావే అంటూ పేర్కొన్నారు. మన్మోహన్ కేబినెట్‌లో ఏడాదిన్నరపాటు మంత్రిగా కేసీఆర్ పనిచేశారని.. మన్మోహన్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.
మన్మోహన్‌కు కడసారి నివాళి అర్పించేందుకు ఢిల్లీ వెళ్లిన తమను ఓ అంశం కలిచివేసిందన్నారు కేటీఆర్. మాజీ ప్రధానులు అందరికి మెమొరియల్ ఉన్నా.. పీవీ ఎందుకు ఉండదు అంటూ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..