మార్చి 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు… 19న బడ్జెట్… BAC సమావేశంలో నిర్ణయం
మార్చి 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. మార్చి 19న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇవాళ ఉదయం గవర్నర్ ప్రసంగం తర్వాత BAC జరిగింది. తెలంగాణ స్పీకర్ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం జరిగింది. మంత్రులు, విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి BACలో పాల్గొన్నారు. బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. అలాగే మిత్రపక్షం సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు BACకి

మార్చి 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. మార్చి 19న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇవాళ ఉదయం గవర్నర్ ప్రసంగం తర్వాత BAC జరిగింది. తెలంగాణ స్పీకర్ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం జరిగింది. మంత్రులు, విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి BACలో పాల్గొన్నారు. బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. అలాగే మిత్రపక్షం సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు BACకి వెళ్లారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకు వీలైనన్ని ఎక్కువ రోజులు సభ నిర్వహించాలని విపక్షాలు కోరాయి. సంప్రదింపుల తర్వాత ఈనెల 27 వరకూ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈనెల 15 నుంచి 18వరకు కులగణనపై చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై సభ చర్చించనుంది. కృష్ణా జలాల హక్కు, రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ, రైతుభరోసా, స్థానిక సంస్థల నిధుల లేమి వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలుపిన తర్వాత కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పార్లమెంట్‌లో ఆమోదం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. సమావేశాలకు ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరయ్యారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామన్నారు గవర్నర్. ప్రజలే కేంద్రం పాలన సాగుతోందని, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ అని పేర్కొన్నారు. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారని, జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నామన్నారు. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ తెలిపారు.
అయితే గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగంలో అన్ని అబద్ధాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రుణమాఫీ, రైతు భరోసా, వరికి రూ.500 బోనస్ ఇవ్వలేదని నినాదాలు చేశారు. సంపూర్ణ రుణమాఫీ చేయాలని, పంట బోనస్ ఇవ్వాలని పట్టుబట్టారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన మధ్యే గవర్నర్ ప్రసంగం ముగిసింది. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం సమావేశాలను వాయిదా వేశారు.