Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inter Exams 2025: ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రశ్నపత్రాల్లో మరో 6 తప్పులు.. తీరు మార్చుకోని ఇంటర్‌ బోర్డు!

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ , సెకండియర్‌ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో వరుస తప్పులు దొర్లుతున్నాయి. దీంతో విద్యార్ధులు అయోమయానికి గురవుతున్నారు. మార్చి10న జరిగిన ఇంటర్‌ సెకండియర్‌ ఇంగ్లిష్‌ ప్రశ్నాపత్రంలో 4 మార్కుల ప్రశ్న మసకగా ముద్రితం కావడంతో ఆ ప్రశ్నను అటెంప్ట్ చేసిన వారందరికీ 4 మార్కులు ఇస్తామని తాజాగా ఇంటర్‌ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే..

Inter Exams 2025: ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రశ్నపత్రాల్లో మరో 6 తప్పులు.. తీరు మార్చుకోని ఇంటర్‌ బోర్డు!
Errors in TG inter question papers
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 12, 2025 | 2:43 PM

హైదరాబాద్‌, మార్చి 12: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ , సెకండియర్‌ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే నాటి నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో వరుస తప్పులు బయటపడుతున్నాయి. మార్చి 10న జరిగిన ఇంటర్‌ సెకండియర్‌ ఇంగ్లిష్‌ ప్రశ్నాపత్రంలో 4 మార్కుల ప్రశ్న మసకగా ముద్రితం కావడంతో ఆ ప్రశ్నను అటెంప్ట్ చేసిన వారందరికీ 4 మార్కులు ఇస్తామని తాజాగా ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇక మంగళవారం ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్ధులకు జరిగిన గగణితం పేపర్‌-1ఏ, బోటనీ, పొలిటికల్‌ సైన్స్‌.. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లోని ప్రశ్నపత్రాల్లోనూ పలు ప్రశ్నల్లో అక్షరదోషాలు వెలుగుచూశాయి. దీంతో ప్రశ్నల అర్థం మారిపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పలేదు. ఈ మూడు పేపర్లలో రెండు చొప్పున మొత్తం 6 తప్పులు దొర్లాయి.

బోటనీలో 13వ ప్రశ్నలో ‘శాఖీయ’ బదులు ‘శాధీయ’ అని అచ్చుతప్పు పడింది. బొటనీ ఇంగ్లిష్‌ మీడియం పేపర్‌-1లో ప్రశ్న నంబర్‌-5లో ‘it is found’ అని ఉండాల్సి ఉండగా, ప్రశ్నపత్రంలో మాత్రం ‘is it found’ అని మరో తప్పు దొర్లింది. మ్యాథమెటిక్స్ (తెలుగు మాధ్యమం)లో 4వ ప్రశ్నలో ‘కోటి’ అనే పదానికి బదులు ‘శ్రేణి’ అని, 9వ ప్రశ్నలో ‘ప్రమేయాన్ని’ బదులు ‘ప్రమేయానికి’ అని వచ్చింది. ఇక పొలిటికల్‌ సైన్స్ పరీక్ష 20వ ప్రశ్నలో ‘జా’కి బదులు ‘జాతీయత’ అని, అదే సబ్జెక్టు ఆంగ్ల మాధ్యమం 32వ ప్రశ్నలోనూ ‘important’కు బదులు ‘importance’ అని మరో తప్పు దొర్లింది. పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నాపత్రాల్లోని ఈ తప్పులు గుర్తించిన ఇంటర్‌బోర్డు అధికారులు తప్పులను సరిచేసుకొని సమాధానాలు రాయాలని పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లకు సమాచారం అందించారు. దీంతో పరీక్ష కేంద్రాల్లోని ఇన్విజిటేర్లు ఆయా ప్రశ్నపత్రంలో దొర్లిన దోషాలకు సరైన పదాలను సూచించి, జవాబులు రాయాలని సూచించారు.

ఇదిలా ఉండగా మంగళవారం జరిగిన పరీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండలో మూడు, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఒకటి చొప్పున ఐదుగురు విద్యార్థులు డిబార్‌ అయ్యారు. మొత్తం 5,53,423 మంది విద్యార్థులకు గానూ 5,29,649 మంది పరీక్షకు హాజరయ్యారు. అంటే 23,774 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.