Alcohol: సడెన్‌గా మద్యం మానేస్తే ఎన్ని అనర్ధాలో..! కోమాలోకి వెళ్లే ఛాన్స్.. బీ కేర్ ఫుల్ బ్రదరో..
అకస్మాత్తుగా మద్యం సేవించడం మానేస్తే, అది కొంతమందిలో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమందిలో మానసిక సమస్యలు, తీవ్ర అలసట కూడా కనిపిస్తుంది. మద్యం సేవించడం అకస్మాత్తుగా ఆపడం వల్ల పలు శరీరక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు..

అతిగా మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిన విషయమే అయినా దానిని వదిలించుకోవడం అంత సాధ్యం కాదు. అందుకే చాలా మంది మద్యపానం మానేయలేకపోతున్నారు. ప్రతిరోజూ తాగకపోయినా, నెలకి రెండు మూడు సార్లు మద్యం తాగినా అది శరీరంలోకి ప్రవేశించి ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుంది. కానీ ప్రతిరోజూ మద్యం తాగే వారు ఒకేసారి తాగడం మానేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యం సేవించడం అకస్మాత్తుగా ఆపడం వల్ల శారీరక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
మానసిక సమస్యలు
అకస్మాత్తుగా మద్యం సేవించడం మానేస్తే కొంతమందిలో తీవ్రమైన మానసిక సమస్యలను కలిగిస్తుంది. కొంతమందికి ఉద్రిక్తత పెరగటం, అలసట అనిపించవచ్చు. కొన్నాళ్లపాటు మద్యం సేవించడం మానేస్తే మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు అంటున్నారు. తాగుడు మానేసిన వారిలో కూడా చాలామందికి చెవుల్లో పెద్ద శబ్దాలు వినిపిస్తాయని కంప్లైంట్ చేస్తుంటారు. అంతేకాకుండా ఎవరో తమను పిలుస్తున్నట్లు అనిపిస్తుందని అంటారు. నిజానికి, మద్యం వ్యసనం నుంచి బయటకు వచ్చినప్పుడు సంభవించే ఒక రకమైన సిండ్రోమ్ ఇది అని నిపుణులు అంటున్నారు.
కోమాలోకి వెళ్లే ఛాన్స్
చాలా సంవత్సరాలుగా మద్యం సేవిస్తున్న వ్యక్తి ఏదో ఒక కారణం చేత తాగడం సడెన్‌గా మానేస్తే, మూడు రోజుల్లోనే మానసిక సమస్యలు కనిపిస్తాయి. కోపం, ముందు ఏమి జరుగుతుందో తెలియని స్థితి, మాట్లాడేటప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు గందరగోళం, కొన్నిసార్లు కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. కొంతమంది సరిగ్గా తినకుండానే పగలు, రాత్రి మద్యం తాగుతుంటారు. అలాంటి వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి వారు అకస్మాత్తుగా మద్యం సేవించడం మానేస్తే మానసిక సమస్యలు తరచుగా నాడీ సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. ఈ దశలో ఇలాంటి వ్యక్తులు ప్రతిదీ మరచిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
మద్యం సేవించడం మానేయాలనుకునే వారు దానిని క్రమంగా తగ్గించుకోవాలి. నెలకు లేదా వారానికి ఒకసారి తాగడం తగ్గించాలి. అప్పుడు దానిని పూర్తిగా ఆపగలుగుతారు. బదులుగా, మద్యపానం పూర్తిగా మానేయడం వల్ల మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. అందువల్ల శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలు రాకుండా ఉండటానికి మద్యం వినియోగాన్ని క్రమంగా తగ్గించాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.