Supreme Court: తెలంగాణ బీసీ రిజర్వేషన్‌పై స్టే కు సుప్రీంకోర్టు నో.. పిటీషన్ కొట్టివేత!
రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపును సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టుకెళ్లి తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా..

హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపును సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం (అక్టోబర్ 6) తిరస్కరించింది. హైకోర్టుకెళ్లి తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ మేరకు పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టులో ఈ అంశంపై విచారణ పెండింగ్‌లో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని విచారణ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడం వల్లనే సుప్రీంకోర్టుకు వచ్చినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు.
కాగా తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు రాజ్యాంగ విరుద్దమని పిటిషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన గోపాల్ రెడ్డి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో 9తో, ఇప్పటికే ఎస్సీలకు అమల్లో ఉన్న 15 శాతం, ఎస్టీలకు 10 శాతంతో కలిపి రిజర్వేషన్లు 67 శాతానికి చేరుతాయి. ఇది ముమ్మాటికీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285కు విరుద్ధం. జీవో 9 ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని దాఖలైన పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేస్తే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉన్నందున సుప్రీంకోర్టును ఆశ్రయించామని, అత్యవసర పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని జీవో అమలుపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో గోపాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే దీనిని ఈ రోజు విచారించిన సుప్రీంకోర్టు ఈ వ్యవహారం హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








