AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంత ఊరిపై మమకారం.. రూ.2 కోట్లతో సర్కారు బడికి హైటెక్ హంగులు అద్దిన వ్యాపార వేత్త..

Yadadri Bhuvanagiri: జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా.. పుట్టిన ఊరు, కన్నతల్లిని మరచిపోకూడదంటారు మన పెద్దలు. కన్నతల్లితో సమానమైన సొంత గ్రామంతో అనుబంధం పేగు బంధం లాంటిది. అలాంటి సొంత ఊరిపై తనకు ఉన్న మమకారంతో ఓ వ్యాపారవేత్త ధనార్జనే ముఖ్యం కాదు.. సొంత గ్రామ అభివృద్ధి లక్ష్యంగా భావించారు. ఏకంగా రెండు కోట్ల రూపాయలతో కార్పొరేట్‌ తరహా అధునాతన వసతులతో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించారు. సర్కారు బడికి హైటెక్ హంగులను అద్దింది ఎవరు..? ఆ స్కూల్ ఎక్కడో తెలుసుకోవాలంటే..

సొంత ఊరిపై మమకారం.. రూ.2 కోట్లతో సర్కారు బడికి హైటెక్ హంగులు అద్దిన వ్యాపార వేత్త..
Iskilla Primary School; Madhusudhan Gupta
M Revan Reddy
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Sep 22, 2023 | 11:56 AM

Share

యాదాద్రి జిల్లా, సెప్టెంబర్ 22: జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా.. పుట్టిన ఊరు, కన్నతల్లిని మరచిపోకూడదంటారు మన పెద్దలు. కన్నతల్లితో సమానమైన సొంత గ్రామంతో అనుబంధం పేగు బంధం లాంటిది. అలాంటి సొంత ఊరిపై తనకు ఉన్న మమకారంతో ఓ వ్యాపారవేత్త ధనార్జనే ముఖ్యం కాదు.. సొంత గ్రామ అభివృద్ధి లక్ష్యంగా భావించారు. ఏకంగా రెండు కోట్ల రూపాయలతో కార్పొరేట్‌ తరహా అధునాతన వసతులతో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించారు. సర్కారు బడికి హైటెక్ హంగులను అద్దింది ఎవరు..? ఆ స్కూల్ ఎక్కడో తెలుసుకోవాలంటే..

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిల్ల గ్రామానికి చెందిన గూండా మధుసూదన్ గుప్తా.. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో బిల్డర్‌గా పేరొందారు. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగిన మధుసూదన్ గుప్తా ‘సుమధుర ఫౌండేషన్‌‌’ను కూడా ఏర్పాటు చేశారు. విద్య కోసం తాను పడిన అష్ట కష్టాలు మరిచిపోలేదు. మారుమూల ప్రాంతంలోని తన గ్రామానికి చెందిన విద్యార్థులు అరకొర వసతులతో అవస్థలు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చింది. దీంతో మధుసూదన్ గుప్తా.. సుమధుర ఫౌండేషన్‌ ద్వారా పాఠశాల అభివృద్ధికి చేయూతను అందించేందుకు ముందుకు వచ్చారు. విద్య ప్రతి విద్యార్థి హక్కు అనే నినాదంతో గ్రామంలో విద్యా సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలలో సదుపాయాల కల్పనకు తన ఫౌండేషన్ ద్వారా పాఠశాల అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలు వెచ్చించి అధునాతన వసతులు కల్పించారు. విశాలమైన 14 తరగతి గదులతో పాటు కంప్యూటర్, సైన్స్‌ ల్యాబ్‌, డిజిటల్‌ లైబ్రరీ, డైనింగ్ హాల్, రెండు అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు, వంట గదులను నిర్మించారు.

3 లక్షల రూపాయలతో డిజిటల్‌ తరగతి గది, విద్యార్థుల ఆహ్లాదం కోసం గ్రీన్ బోర్డులు ప్రత్యేక గ్రీనరీతోపాటు క్రీడా సామగ్రి, లైబ్రరీలో రూ.50వేలు విలువైన పుస్తకాలు, ప్రొజెక్టర్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి సదుపాయాలు కల్పించారు. 11000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన సౌకర్యాలతో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని నిర్మించారు. రెండు కోట్ల రూపాయలతో సుమధుర ఫౌండేషన్ చైర్మన్ మధుసూదన్ గుప్తా ఇస్కిల్ల సర్కారు బడికి హైటెక్ హంగులను అద్దారు. దీంతో పాటు విద్యార్థులకు అవసరమైన సామాజిక చేయూతను కూడా అందించారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు సైకిళ్లు కూడా పంపిణీ చేశారు. యువత అభ్యున్నతి కోసం యూట్యూబ్‌, బేసిక్‌ కంప్యూటర్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణను ఏర్పాటు చేశారు. ఇక హైటెక్ హంగులను అద్దిన ఈ సర్కారు బడిని నేడు మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డి, జగపతిరావు, సుమధుర ఫౌండేషన్ చైర్మన్ మధుసూదన్ గుప్తా వైస్ చైర్మన్ రామారావు పాల్గొన్నారు. హైటెక్ హంగులతో కూడిన ఈ పాఠశాల.. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని మంత్రి ఆకాంక్షించారు. ధనార్జనే ధ్యేయంగా కాకుండా సొంత ఊరి కోసం సామాజిక సేవ చేయాలని మంత్రి అన్నారు. ఎన్నారైలు, వ్యాపారవేత్తలు ముందుకు వచ్చి తమ సొంత గ్రామాల అభివృద్ధికి నడుం బిగించాలని ఆయన కోరారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఎన్నారైలు, వ్యాపారవేత్తలు చేయూతనివ్వడం ద్వారా అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయని అన్నారు.

పుట్టిన ఊరి కోసం ఎంత సేవ చేసినా తక్కువే

ఇస్కిల్లలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించటం ద్వారా పుట్టిపెరిగిన గ్రామంలో సేవ చేయాలనే నా కల సాకారమైందని సుమధుర ఫౌండేషన్ చైర్మన్ మధుసూదన్ గుప్తా అన్నారు. పుట్టిన ఊరు కన్నతల్లితో సమానం.. పుట్టిన ఊరి అభివృద్ధి కోసం ఎంత చేసినా తక్కువేనని ఆయన అన్నారు. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలన్నదే నా లక్ష్యమని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఈ పాఠశాల వారధిగా నిలుస్తుందని మధుసూదన్ గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని చెప్పారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలతో మరికొందరు ఎన్నారైలు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..