Guntur Road Accident: ఏపీలో రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన తెలంగాణ సీఎం
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దాచపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ దామరచర్ల మండలం నర్సపూర్ గ్రామానికి చెందిన ఆరుగురు గిరిజన కూలీలు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దాచపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సపూర్ గ్రామానికి చెందిన ఆరుగురు గిరిజన కూలీలు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. కూలీలు గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతి ని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సిఎం సంతాపం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు.
గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్సను అందించాలని స్థానిక మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావును సిఎం కేసిఆర్ ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావులు ప్రమాద సంఘటనను వివరించి తగు సహాయం చేయాలని కోరారు. ఆ మేరకు మృతుల కుటుంబాలకు తలా రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.1 లక్ష ఎక్స్ గ్రేషియాను సిఎం కేసిఆర్ ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..