Munugode ByPoll: మునుగోడులో బీజేపీ ఓటమికి కారణాలివేనా.. గులాబీ పార్టీకి కలిసొచ్చిన అంశాలు..

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపుపై భారతీయ జనతాపార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మునుగోడు గెలుపు.. తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పుతుందనే నినాదాన్ని ఆ పార్టీ అందుకుంది. నియోజకవర్గంపై పట్టున్న నాయకుడు పార్టీలో చేరడంతో తమ విజయం ఖాయమని కమలం పార్టీ..

Munugode ByPoll: మునుగోడులో బీజేపీ ఓటమికి కారణాలివేనా.. గులాబీ పార్టీకి కలిసొచ్చిన అంశాలు..
Bjp Vs Trs
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 06, 2022 | 5:24 PM

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపుపై భారతీయ జనతాపార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మునుగోడు గెలుపు.. తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పుతుందనే నినాదాన్ని ఆ పార్టీ అందుకుంది. నియోజకవర్గంపై పట్టున్న నాయకుడు పార్టీలో చేరడంతో తమ విజయం ఖాయమని కమలం పార్టీ భావించింది. కాని ఫలితాలు మాత్రం బీజేపీకి నిరాశ కలిగించాయి. ముఖ్యంగా ఆ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ఫలితం గట్టి షాక్ ఇచ్చింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో టీఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. ఓటమి చెందినప్పటికి బీజేపీ, టీఆర్ ఎస్ కు మధ్య హోరా హోరీ పోరు నడిచింది. మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ కావాలనే తెచ్చుకుంది. ఈ ఎన్నికను బీజేపీ రెండు విధాలా ఆలోచింనట్లు తెలుస్తోంది. గెలిస్తే ఓకే.. గెలవకపోయినా.. తమ పార్టీకి బలం లేని చోట కూడా టీఆర్ ఎస్ ను ఢీకొట్టగలిగామని, కాంగ్రెస్ తో పోలిస్తే ప్రజలు బీజేపీని టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారనే సంకేతాలు ప్రజల్లో తీసుకెళ్లడానికి మునుగోడును ఉపయోగించుకుంది బీజేపీ. అయితే రాజగోపాల్ రెడ్డి ఓటమికి, టీఆర్ ఎస్ గెలుపునకు అనేక ఫ్యాక్టర్స్ పనిచేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎలక్షన్ ఇంజినీరింగ్ అద్భుతంగా చేయడం గులాబీ పార్టీకి కలిసి వచ్చింది. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చిందని, స్వలాభం కోసమే ఆయన బీజేపీలో చేరారనే ప్రచారాన్ని టీఆర్ఎస్ క్షేత్రస్థాయికి తీసుకెళ్లగలిగింది. ఎన్నికల ప్రకటన రాకముందే ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతు తీసుకోవడం టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చింది. సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం, బీసీలకు తాయిలాలు ప్రకటించడం, కొన్ని నెలల ముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేయడం, చివర్గో ఓటర్లకు ప్రలోభాల ఎర వంటివి టీఆర్ ఎస్ గెలుపునకు సహకరిస్తే.. బీజేపీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యాయి.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ 20 వేలకు పైగా ఓట్లను తెచ్చుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె స్రవంతి పోటీచేయడం రాజ్ గోపాల్ రెడ్డి ఓటమికి కారణమైంది. గోవర్థన్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి పేరుండటం, ఆయన మంత్రిగా పనిచేయడం వంటివి స్రవంతి 20 వేల ఓట్లను సాధించడానికి కారణాలైతే.. స్రవంతి పోటీ చేయడం ద్వారా రాజ్ గోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఎప్పటినుంచో ఓటు వేస్తూ వస్తున్న సంప్రదాయ ఓటర్లు హస్తం పార్టీకే ఓటు వేశారు. గతంలో టీఆర్ ఎస్ ను ఓడించడం కోసం హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటర్లు బీజేపీకి వేశారనే ప్రచారం సాగింది. మునుగోడులో మాత్రం స్రవంతి అభ్యర్థిగా ఉండటంతో రాజ్‌గోపాల్ రెడ్డి కి కాంగ్రెస్ సంప్రాదాయ ఓట్లు పడలేనట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు ఫామ్ హౌస్ ఫైల్స్ లో బీజేపీని దోషిగా చూపించడం కూడా కమలం పార్టీ అభ్యర్థి ఓటమికి కారణాలుగా విశ్లేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మోహరించడం, జనాభా తక్కువుగా ఉన్న గ్రామానికి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, జనాభా ఎక్కువుగా ఉండే గ్రామాలకు ఇద్దరు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను టీఆర్ ఎస్ పార్టీ మోహరించింది. మరోవైపు బీజేపీ నోట్ల పంపిణీకి అడ్డుకట్టవేయగలిగింది టీఆర్ ఎస్. సీఏం కేసీఆర్ సభ, కేటీఆర్ మునుగోడు దత్తత వంటివి కూడా టీఆర్ ఎస్ గెలుపునకు దోహదపడినట్లు తెలుస్తోంది. టీఆర్ ఎస్ ను ఓడిస్తే మునుగోడులో అభివృద్ధి వెనుకబడిపోతుందనే భయం స్థానికుల్లో నెలకొందని కొందరు రాజకీయ పండితుల అభిప్రాయం. ఎన్నికకు ముందు కొత్తగా గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేయడం కూడా టీఆర్ ఎస్ పార్టీకి ఆ ప్రాంతంలో మెజార్టీ రావడానికి దోహదపడినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..