Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode ByPoll: మీడియా అట్రాక్షన్ ఓకే.. ప్రజాశాంతి పార్టీ ఓట్లపై సర్వత్రా ఆసక్తి.. కెఎ.పాల్ ఓటర్లను ఆకర్షించగలిగారా..

మునుగోడు ఉప ఎన్నిక దేశం దృష్టిని ఆకర్షిస్తే ఓ నాయకుడు మాత్రం మునుగోడు దృష్టిని ఆకర్షించాడు.. కాదు కాదు తెలంగాణ ప్రజల దృష్టినే ఆకర్షించారు. మునుగోడులో 47 మంది అభ్యర్థులు పోటీచేయగా, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ ఎస్ పార్టీలు మినహిస్తే ఇతర పార్టీలు, స్వతంత్య్ర..

Munugode ByPoll: మీడియా అట్రాక్షన్ ఓకే.. ప్రజాశాంతి పార్టీ ఓట్లపై సర్వత్రా ఆసక్తి.. కెఎ.పాల్ ఓటర్లను ఆకర్షించగలిగారా..
KA Paul
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 05, 2022 | 7:56 PM

మునుగోడు ఉప ఎన్నిక దేశం దృష్టిని ఆకర్షిస్తే ఓ నాయకుడు మాత్రం మునుగోడు దృష్టిని ఆకర్షించాడు.. కాదు కాదు తెలంగాణ ప్రజల దృష్టినే ఆకర్షించారు. మునుగోడులో 47 మంది అభ్యర్థులు పోటీచేయగా, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ ఎస్ పార్టీలు మినహిస్తే ఇతర పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులు కలిపి 44 మంది పోటీ చేశారు. వారిలో ఒకే ఒక నాయకుడు అందరిని ఆకట్టుకున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే ఎక్కువుగా వార్తల్లో నిలిచిన వ్యక్తి కూడా ఆయనే. ప్రతి రోజూ మునుగోడులో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం ఆ నాయకుడు ఈ రోజు మునుగోడులో ఏం చేశారో చూసేవారు. టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ ప్రచారం, విమర్శలు, ప్రతి విమర్శలతో మునుగోడులో మంటపుట్టిస్తే.. ఆ నాయకుడు మాత్రం తన వేషధారణలు, మాటలతో ప్రజల్లో నవ్వులు పూయిస్తూ.. మంటను చల్లార్చే ప్రయత్నం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం రావడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. పోలింగ్ పూర్తై.. పోటీ ఎవరి మధ్య అనేది సుస్పష్టమైంది. అయినా సరే ఇప్పటికి కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఒకే ఒక నాయకుడు డాక్టర్ కె.ఎ.పాల్. ఓ స్వంతంత్య్ర పార్టీ అభ్యర్థి గురించి ఇంత పెద్ద చర్చ జరగడం ఇదే తొలిసారి కావచ్చు. కాని దానికి ప్రధాన కారణం ఆ నాయకుడికి ఉన్న గత చరిత్రే కారణం.

ఒకానొక సమయంలో కెఎ.పాల్ ను కాలవాలంటే ముందస్తు అపాయింట్ మెంట్.. మాట్లాడాలంటే పెద్ద హోదానే ఉండి ఉండాలి. కాని ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. అంతర్జాతీయ మత బోధకుడిగా ఓ వెలుగు వెలిగిన కె.ఎ.పాల్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఓ కమెడియన్ గా మారారు. దేశ రాజకీయాల్లో మార్పులు తీసుకువస్తానంటూ ప్రజాశాంతి పార్టీని స్థాపించిన కెఎ.పాల్.. పార్టీ పెట్టినప్పటినుంచి సీరియస్ గా రాజకీయాలు చేసిన దాఖలాలు కన్పించలేదు. అయితే తాజాగా మునుగోడులో తన పార్టీ అభ్యర్థిగా ప్రజాగాయకుడు గద్దర్ పోటీచేస్తారని ప్రకటించి.. అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. అనివార్య కారణాలతో గద్దర్ పోటీకి దూరంగా ఉండటంతో తానే పార్టీ అభ్యర్థి అయ్యారు కె.ఎ.పాల్. నామినేషన్ వేసినప్పటి నుంచి మునుగోడులో అన్ని గ్రామాలు తిరుగుతూ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ప్రచారంలో ప్రధాన అభ్యర్థులతో పోటీపడినట్లు కన్పించారు. కొన్ని సందర్భాల్లో అయితే ఇతర పార్టీల కార్యకర్తలు కూడా పాల్ సభలో కన్పించేవారు. డాక్టర్ కె.ఎ.పాల్ తో సెల్ఫీల కోసం మునుగోడు వాసులు క్యూ కట్టారంటే అతిశయోక్తి కాదు. ఓ వైపు తన వేషధారణలతో మరో వైపు తన మాటలతో మీడియాను అట్రాక్ట్ చేశాడు డాక్టర్ కె.ఎ.పాల్. మీడియా సమావేశమని మీడియాను పిలిచి.. సోఫాపై పడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పోలింగ్ వరకు తన వ్యవహర శైలితో అందరిని నవ్వించి.. ప్రజల దృష్టిని ఆకర్షించగలిగాడు కె.ఎ.పాల్. పోలింగ్ ముగిసిన తర్వాత.. బీజేపీ, టీఆర్ ఎస్ మధ్యనే పోటీ జరిగిందనే చర్చ ఈ నోటా ఆ నోటా వినిపిస్తోంది. అది నిజం కూడా కావచ్చు. కాని పోలింగ్ పూర్తైన తర్వాత కూడా గెలుపు తనదేనని, 50 వేల మెజార్టీ వస్తుందంటూ గట్టి స్వరంతో చెప్పడం అందరిని నవ్వించింది. పది వేల మెజార్టీ వస్తుందో లేదో అని ప్రధాన పార్టీ అభ్యర్థులు టెన్షన్ పడుతున్న వేళ.. తనకు 50 వేల మెజార్టీ వస్తుందంటూ కెఎ.పాల్ కౌంటింగ్ చివరి వరకు ప్రజలను నవ్వించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చర్చంతా ఒకటే మీడియాను అట్రాక్ట్ చేయగలిగిన కె.ఎ.పాల్ మునుగోడు ఓటర్లను ఆకర్షించగలిగారా అనేది ఆసక్తికర చర్చగా మారింది. పాల్ గెలుపు అసాధ్యమని అందరికి తెలుసు.. ఒక వేళ గెలిస్తే అది అత్యద్భుతమే అవుతుంది. కాని పాల్ గెలవడం అనేది అసాధ్యం. అయితే ప్రజాశాంతి పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయనేది మాత్రం ఆసక్తి రేపుతోంది. సాధారణంగా ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడతారనే దానిమీద బెట్టింగ్ లు జరుగుతుంటాయి. కాని ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి కె.ఎ.పాల్ కు ఎన్ని ఓట్లు వస్తాయి.. ఎన్ని వేల ఓట్లు దాటతాయి అనేదానిపై కూడా కొందరు బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్ వేస్తున్నారంట.. మునుగోడు ఫలితం కోసం అందరూ ఎదురుచూస్తుంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం కె.ఎ.పాల్ కు ఎన్ని ఓట్లు వస్తాయనేదానిపైనే చర్చ జరుగుతోంది. కౌంటింగ్ తర్వాత అయినా పాల్ కామెడికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా మరో కొత్త అంశాన్ని ఏమైనా ఎత్తుకుంటారా అనేది వేచిచూడాల్సిందే. ప్రజాశాంతి పార్టీ ప్రభావం ఎంత అనేది కూడా మరి కొన్ని గంటల్లో తేలనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..