Madhira TRS: ఎగరట్లేదా..? ఎగరనివ్వట్లేదా..? మధిర గులాబీ దళంలో పెరిగిన గ్రూపుల గోల..
నియోజకవర్గాల పునర్విభజనతో మధిర నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ గా మారింది. 2009 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో లింగాల కమల్ రాజ్ సిపిఎం తరఫున పోటీ చేసి భట్టి విక్రమార్క చేతిలో పరాజయం పాలయ్యారు.

ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఇక్కడ గెలవాలని ఎంత ప్రయత్నించినా గులాబీ గుబాళించట్లేదు. దీనికి దీటైన అభ్యర్థి లేకపోవడం కారణమని కొందరు, గ్రూపుల గోల కారణమని మరికొందరు చెబుతున్నారు. అయితే ఒక కారు అనేకమంది డ్రైవర్ల వల్లే ఈ దుస్థితి అని మరికొందరు నేతలు వాపోతున్నారుట.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం.. ఏపీ సరిహద్దు ఎక్కువగా ఉండడంతో పాటు సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతం. కొద్దికాలం కమ్యూనిస్టులు, కొద్దికాలం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌కు రాజకీయంగా కలిసి రావడం లేదు. దీటైన అభ్యర్థి లేకపోవడంతో ప్రత్యర్థులకు కలిసివస్తోందంటున్నారు. క్రాస్ ఓటింగ్ కూడా పార్టీ ఓటమికి కారణమనే చర్చ కూడా నడుస్తోంది. వేర్వేరు పార్టీల తరపున పోటీ చేసి హ్యాట్రిక్ ఓటమి పాలైన ప్రస్తుత జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్న ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి మధ్య టికెట్ కోసం వార్ నడుస్తోంది. ఎవరికి వారే తమ వర్గాన్ని ఏర్పాటు చేసుకొని టికెట్ తనకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
నియోజకవర్గాల పునర్విభజనతో మధిర నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ గా మారింది. 2009 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో లింగాల కమల్ రాజ్ సిపిఎం తరఫున పోటీ చేసి భట్టి విక్రమార్క చేతిలో పరాజయం పాలయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా నుంచి చురుగ్గా పాల్గొన్నవారిలో బొమ్మెర రామ్మూర్తి ఒకరు. 2014 ఎన్నికల్లో మధిరలో టిఆర్ఎస్ నుండి బొమ్మెరకు టిక్కెట్ లభించినా ఆయన గెలవలేకపోయారు.




లింగాల కమల్ రాజ్ ఓటమి..
సిపిఎం,వైసీపీల పొత్తుతో కమల్ రాజు 2014లో రెండోసారి బరిలో నిలిచి భట్టి చేతిలో ఓటమి పాలయ్యారు. టిఆర్ఎస్ తరుపున పోటీ చేసిన రామ్మూర్తి కి కేవలం 12వందల ఓట్లే వచ్చాయి. తర్వాత కమల్ రాజు గులాబీ గూటికి చేరారు. టిఆర్ఎస్ అధిష్టానం రామ్మూర్తి ని బుజ్జగించి 2018 ఎన్నికల్లో కమల్‌రాజుకు టికెట్ ఇచ్చినా ఆయన ముచ్చటగా మూడోసారి కూడా భట్టి విక్రమార్క చేతిలో ఓడిపోయారు.
మధిర ఇన్‌చార్జిగా లింగాల.. ప్రయత్నాలు ఆపని బొమ్మెర
ఓటమి పాలైన కమల్ రాజుని టీఆర్‌ఎస్ అధిష్ఠానం నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది. కమల్‌రాజు తరచు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో సంబంధాలు పెంచుకుంటున్నారు. తాజాగా కమల్‌రాజు టీఆర్‌ఎస్ తరఫున పోటీకి దిగనున్నట్టు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ స్వయంగా ప్రకటించడంతో కమల్‌కే టికెట్ కన్‌ఫాం అయిందంటున్నారు ఆయన అనుచరులు. అయితే చాపకింద నీరులా ఉద్యమకారుడు బొమ్మెర తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారు.
పొంగులేటికి భారీగా అనుచరగణం.. పోటీ చేసే ఆలోచనలో టీడీపీ
మరోవైపు మధిరలో టీడీపీకి కొంత బలం ఉంది. ఎవరికో మద్దతు ఇచ్చే బదులు ఈ సారి తామే పోటీలో నిలవాలని టీడీపీ ఆలోచన చేస్తోందంటున్నారు. అదే జరిగితే టీఆర్‌ఎస్‌కు కలిసివస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇంకోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నియోజకవర్గంలో బలమైన అనుచర వర్గం ఉంది. అయితే గతంలో తన అనుచరుడిగా ఉన్న కమల్ రాజు.. మంత్రి పువ్వాడ అజయ్ అనుచరుడిగా మారిపోవడంతో ఈసారి పొంగులేటి వర్గం ఎవరికి మద్దతు ఇస్తుందనేది సస్పెన్స్‌గా మారింది. పొంగులేటి వర్గం గనక పోటీలో దిగితే టీఆర్‌ఎస్ అభ్యర్థికి నష్టం తప్పదని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
నియోజకవర్గ మాజీ ఇంచార్జి బొమ్మెర రామ్మూర్తి మాత్రం ఈ సారి టికెట్ తనదేనంటున్నారు. మూడు సార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించడంతో పాటు తనకు టికెట్ రాకపోయినా బరిలో దిగుతానంటున్నారు. దీంతో టీఆర్‌ఎస్ టికెట్ ఎవరిని వరిస్తుందో చూడాలంటున్నారు ఆ పార్టీ నేతలు. పార్టీలో గ్రూపుల గోలతో పాటు టీడీపీ, పొంగులేటి ఫ్యాక్టర్లు పనిచేస్తుండడంతో మధిరలో ఈసారైనా గులాబీ జెండా ఎగురుతుందా అనేది వేచి చూడాలంటున్నారు విశ్లేషకులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
