Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode Result: ఆ ఓట్లు పడ్డవారిదే విజయం..! మునుగోడు బైపోల్‌పై రూ.10 వేల నుంచి లక్షల్లో బెట్టింగ్‌..

తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో ఓటింగ్‌ నమోదైంది. గతంలో ఎన్నడూలేని విధంగా మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు.

Munugode Result: ఆ ఓట్లు పడ్డవారిదే విజయం..! మునుగోడు బైపోల్‌పై రూ.10 వేల నుంచి లక్షల్లో బెట్టింగ్‌..
Betting on Munugode By Election
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 05, 2022 | 6:10 PM

తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో ఓటింగ్‌ నమోదైంది. గతంలో ఎన్నడూలేని విధంగా మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. రాత్రి పొద్దుపోయే వరకు ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే 24 వేల మందికి పైగా ఓటర్లు పెరిగారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం కంటే ఈసారి 2.11 శాతం అదనంగా పోలింగ్‌ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 91.30 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, ఈసారి 93.41 శాతం మంది ఓట్లు వేశారు. నియోజకవర్గంలో 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 686 పోస్టల్‌ ఓట్లు కాగా, 2,25,192 మంది స్వయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హైదరాబాద్, ముంబై, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేశారు. దివ్యాంగులు, మంచానికి పరిమితమైన 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈసారి పోస్టల్‌ బ్యాలెట్‌కు అవకాశం ఇవ్వడంతో పోలింగ్‌ శాతం పెరింగింది. అయితే, చివరి కొన్ని గంటల్లో పోలైన ఓట్లు ఎవరికి పడ్డాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆ ఓట్లే గెలుపోటములను ప్రభావితం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో ఆ ఓట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పోలింగ్‌ రోజున సాయంత్రం 5 గంటల తరువాత 37,665 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి పోలింగ్‌ ఊపందుకున్నా సాయంత్రం 5 గంటల తరువాత అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. అవి తమకు పడ్డాయంటే తమకే పడ్డాయంటూ అభ్యర్థులు, ఆయా పార్టీల వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ సమయం ముగిసే వరకు లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో కొన్నిచోట్ల రాత్రి 9 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది.

ఉదయం ఎక్కువ మంది వృద్ధులు, మధ్య వయస్కులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తరువాతే ఎక్కువ మంది మహిళలు, యువత, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పోలింగ్‌లో పాల్గొన్నారు. 5 గంటల సమయంలో కూడా ఎక్కువ మంది మహిళలు, యువతే వచ్చి లైన్లలో నిల్చున్నారు. రాత్రి 9 గంటల వరకు కూడా వారే పోలింగ్‌లో పాల్గొన్నారు. వీరంతా ఎవరికి ఓట్లు వేశారన్నది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఇతర ప్రాంతాల వారు ఉదయమే వచ్చి పోలింగ్‌లో పాల్గొని వెళ్లిపోతారు. అయితే చాలామంది ఆలస్యంగా నియోజకవర్గానికి చేరు కోగా, ఉదయం వచ్చినవారిలో కూడా చాలామంది సాయంత్రం వరకు వేచి ఉన్నారు. మరోవైపు రెండో విడత డబ్బులు పంచుతారన్న ఆలోచనతో చాలా మంది గ్రామాల్లోనే ఆగిపోయినట్లు సమాచారం. అవి అందాకే పోలింగ్‌ కేంద్రాల బాట పట్టారు.

ఇవి కూడా చదవండి

కొందరు ఓటర్లు తమకు డబ్బులు అందలేదంటూ గొడవలకు దిగారు. అవి అందిన తర్వాత సాయంత్రం ఒక్కసారిగా పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటే.. ఏ పార్టీ అభ్యర్థికైనా లక్ష ఓట్లు మించి పోలైతేనే గెలుపొందే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తే 90 వేల వరకు వచ్చిన అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నికలో గెలిచేదెవరన్నదానిపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఒక పార్టీకి అనుకూలంగా ఉండటం, పోలింగ్‌ రోజు సాయంత్రం మహిళలు, యువత అధిక సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడాన్ని పరిగణనలోకి తీసుకుని బెట్టింగ్‌లను కొనసాగిస్తున్నారు. 10 వేల రూపాయలు మొదలుకొని లక్షల్లో బెట్టింగ్‌లు కాస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపై మొత్తం రూ. వేయి కోట్ల వరకు బెట్టింగ్ నడుస్తోందని సమాచారం. అటు బూకీలు సైతం రంగంలోకి దిగి.. ఈ ఉప ఎన్నికను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నాలు పూర్తయ్యాయని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..