Watch Video: బాబోయ్ ఎలుకలు.. ఇట్టాగైతే చదివేదెట్టా? సర్కార్ హాస్టళ్లలో విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటం..
రాష్ట్ర రెసిడెన్సియల్ స్కూళ్లలో విద్యార్ధుల భద్రత గాలికొదిలేశారు అధికారులు.. రోజుకో ఉదంతం వెలుగులోకి వస్తున్నా చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికే పలు హాస్టళ్లలో విద్యార్ధులు మృతి చెందగా.. వందల సంఖ్యలో విద్యార్ధులు ఆస్పత్రి పాలవుతున్నారు. తాజాగా మరో హాస్టల్ లో ఇంకో భయానక సంఘటన వెలుగులోకి వచ్చింది..

హుజురాబాద్, జులై 26: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ బ్యాక్ వార్డ్ బాయ్స్ రెసిడెన్సియల్ స్కూల్ లో స్టూడెంట్స్‌ని ఎలుకలు కరిచాయి. 10 మంది వరకు గాయలైనట్లు సమాచారం. వారిని స్థానిక హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందజేశారు. క్లాస్ రూమ్‌లలోకి ఎలుకలు స్వైరవిహారం చేస్తుండటంతో స్టూడెంట్స్ భయాందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రులు స్కూల్ కు పంపేందుకు జంకుతున్నారు. పాఠశాలలోకి ఎలుకలు తిరుగుతూ విద్యార్థులను గాయపరచడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ అలసత్వంపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. వరుసగా రెండు రోజులు విద్యార్థులకు ఎలుకలు కరిచినట్లు సమాచారం. అసలు హాస్టల్లోకి ఎలుకలు రాకుండా చర్యలు ఎందుకు చేపట్టడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు కనీస వసతులు కల్పించకుండా పాఠశాల నిర్వహించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రిన్సిపాల్ రాణి మాట్లాడుతూ ఎలుకలు కరువకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నామని, ఎలుకలు బోనులు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. స్కూల్ బిల్డింగ్ పక్కన చెత్త చెదారం, రైస్ మిల్ ఉండటంతో ఎలుకలు ఎక్కువగా వస్తున్నాయని ప్రిన్సిపల్ తెలిపారు. ప్రిన్సిపల్ చెప్పినట్లుగా పక్కన రైస్ మిల్ తోపాటు చెత్తాచెదారం ఉంటే భవిష్యత్తులో ఎలుకలతో పాటు పాములు కూడా సంచరించే ప్రమాదం కూడా ఉంది.
ఒకవేళ ఎలకల కోసం పాములు కూడా వెతుక్కుంటూ పాఠశాలలోకి ప్రవేశిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నలు ఉప్పన్నమవుతున్నాయి. రాత్రివేళ పిల్లలకు ఏదైనా కుడితే అది ఎలక కుట్టిందా లేక ఇంకేదైనా క్రిమి కీటకం కొట్టిందో ఎలా తెలుస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో మరమ్మత్తులు నిర్వహించి పాఠశాల విద్యార్థులను కాపాడాలంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








