ముగిసిన నక్సల్స్ వేట.. గ్రేహౌండ్స్ కమెండోలకు కొత్త బాధ్యతలు.. పోలీస్ కొత్త వ్యూహం ఇదేనా!
తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గడంతో, రాష్ట్ర పోలీస్ శాఖ తన వ్యూహాలను మారుస్తోంది. ఒకప్పుడు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పనిచేసిన గ్రేహౌండ్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) విభాగాల్లో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారుతున్న తరుణంలో, ఈ విభాగాల్లోని నిపుణులైన సిబ్బందిని ఇతర కీలక విభాగాలకు మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

1989లో ఐపీఎస్ అధికారి కేఎన్ వ్యాస్ సారథ్యంలో ప్రారంభమైన గ్రేహౌండ్స్, దేశంలోనే అత్యుత్తమ యాంటీ-నక్సల్ ఫోర్స్‌గా గుర్తింపు పొందింది. గత 37 ఏళ్లలో అనేక విజయాలను సాధించిన ఈ విభాగం, ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. అయితే, కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ మరియు రాష్ట్ర ప్రభుత్వ పునరావాస పథకాల వల్ల గత రెండేళ్లలో 818 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు.
ప్రస్తుతం గ్రేహౌండ్స్ విభాగంలో సుమారు 1,700 మంది సిబ్బంది డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. తాజా ప్రణాళిక ప్రకారం తిరిగి మాతృ విభాగాలకు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు సగం మంది సిబ్బందిని వారి సొంత జిల్లాలకు లేదా విభాగాలకు పంపనున్నారు. గ్రేహౌండ్స్ నుంచి వచ్చే అనుభవజ్ఞులైన సిబ్బందిని కొత్తగా ఏర్పాటవుతున్న ‘ఈగల్ ఫోర్స్’, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో వినియోగించుకోనున్నారు. ఎస్ఐబీలోని నిఘా నిపుణులను ఇకపై మావోయిస్టుల కోసం కాకుండా, సైబర్ నేరగాళ్ల ట్రాకింగ్, ఇతర అంతర్గత భద్రతా అంశాల కోసం కేటాయించనున్నారు.
అడవుల్లో మావోయిస్టుల సంచారం తగ్గడంతో, పోలీసు శాఖ ఇప్పుడు ఆధునిక నేరాలపై దృష్టి సారిస్తోంది. క్షేత్రస్థాయిలో గెరిల్లా యుద్ధ తంత్రాల్లో ఆరితేరిన కమెండోలను, నిఘా వర్గాలను ఇప్పుడు సైబర్ నేరాలు మరియు ఇతర ఉగ్రవాద వ్యతిరేక చర్యల వైపు మళ్లించడం ద్వారా రాష్ట్ర భద్రతను మరింత పటిష్టం చేయవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..