ఈ కోడి పుంజుని కూర వండి తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష ఖాయం! ఎందుకో తెల్సా..
తెలుగు వారికి కోడి కూరకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సందర్భం ఏదైనా సరే చికెన్ కర్రీతో సెబల్రేట్ చేసుకుంటారు. అయితే పై ఫొటోలో కనిపిస్తున్న కోడిని మాత్రం పొరబాటున గుటుక్కుమనిపించారో జైలు శిక్ష ఖాయం. అదేంటి ప్రతిరోజూ వందల క్వింటాళ్ల కోడి మాంసం విక్రయాలు జరుగుతుంటే ఈ కోడికి మాత్రమే ఎందుకు జైలు శిక్ష విధిస్తారు? అనే సందేహం మీకూ వచ్చిందా..! ఎందుకంటే ఇది సాధారణంగా గ్రామాల్లో తిరిగే కోడి పుంజు కాదండోయ్.. అడవిలో మాత్రమే నివసించే అడవి కోడి. దీన్ని గ్రే జంగిల్ ఫౌల్ లేదా జంగ్లీ ముర్గా (బూడిద రంగు అడవి కోడి) అని పిలుస్తారు..

మన దేశంలో అడవుల్లో మాత్రమే కనిపించే జంగ్లీ ముర్గా లేదా అడవి కోడిని వన్యప్రాణి రక్షణ చట్టంలో చేర్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఈ కోళ్లను వేటాడితే జరిమానాతోపాటు మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది. అడవుల్లో మాత్రమే కనిపించే ఈ పక్షులు నేల మీద తిరుగుతాయి. అలికిడైతే పారిపోయి చెట్లపైకి ఎగురుతాయి. గింజలు, చెదలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ఏపీ, తెలంగాణ అడవుల్లోనూ ఈ అడవి కోళ్లు కనిపిస్తాయి. జంగ్లీ ముర్గా లేదా అడవి కోళ్లు అడవుల్లో స్వేచ్ఛగా జీవించే వణ్య ప్రాణులు. భారతదేశంలోని పలు అటవీ ప్రాంతాల్లో ఇవి కనిపిస్తాయి. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో ఈ పక్షులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వేటాడటం, పట్టుకోవడం, చంపడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. ఇలా చేస్తే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. అడవుల నరికివేత, అక్రమ వేట, నివాస ప్రాంతాల తగ్గుదల కారణంగా అడవి కోళ్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో ప్రభుత్వం వీటిని వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 కింద రక్షిత జాతుల జాబితాలో చేర్చింది.
వేటాడితే ఎలాంటి శిక్ష ఉంటుంది?
వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అడవి కోడిని వేటాడటం నేరం. వీటిని పట్టుకోవడం, విక్రయించడం, మాంసం నిల్వ ఉంచడం కూడా చట్ట విరుద్ధం. నేరం నిరూపితమైతే జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. శిక్ష తీవ్రత కేసు స్వభావాన్ని బట్టి మారవచ్చు.
ఎందుకు ఇంత కఠిన చట్టాలు?
అడవి జీవుల సంరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడటం ప్రభుత్వ లక్ష్యం. ఒక జాతి అంతరించిపోతే ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటుంది. అందుకే అడవి జంతువులు, పక్షుల వేటపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. అడవుల్లో వన్యప్రాణులు కనిపిస్తే వాటికి హాని చేయకుండా అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోల కోసం వేటాడటం లేదా పట్టుకోవడం కూడా నేరమేనని అధికారులు హెచ్చరిస్తున్నారు.
