AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైకమాండ్ ఆదేశం.. రాహుల్ గాంధీ మంత్రాంగం.. కర్ణాటకలో మారనున్న సీన్!

కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకోబోతోంది. గత మూడు సంవత్సరాలుగా సాగుతున్న నాయకత్వ మార్పు ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తన డిప్యూటీ డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేందుకు మార్గం సుగమం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ కోరిన నేపథ్యంలో సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

హైకమాండ్ ఆదేశం.. రాహుల్ గాంధీ మంత్రాంగం.. కర్ణాటకలో మారనున్న సీన్!
Karnataka Leadership Change
Balaraju Goud
|

Updated on: May 28, 2026 | 9:22 AM

Share

కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకోబోతోంది. గత మూడు సంవత్సరాలుగా సాగుతున్న నాయకత్వ మార్పు ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తన డిప్యూటీ డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేందుకు మార్గం సుగమం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ కోరిన నేపథ్యంలో సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గురువారం (మే 28) ఉదయం తన కేబినెట్ సహచరులతో ఏర్పాటు చేసిన అల్పాహార సమావేశం తర్వాత, సిద్ధరామయ్య రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పదవి నుంచి వైదొలగాలని ఆయన నిశ్చయించుకున్నారు.

పార్టీ వర్గాల కథనం ప్రకారం, సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ హైకమాండ్ కీలక ఆఫర్లు ఇచ్చింది. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు అవకాశం కల్పించాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే జాతీయ స్థాయిలో సిద్దరామయ్య కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. ఏఐసీసీలో ప్రాధాన్యత కలిగిన పదవిని అప్పగిస్తామని అధిష్టానం ఆఫర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ స్వయంగా కోరడంతో సిద్ధరామయ్య మెత్తబడినట్లు సమాచారం. “రాహుల్ గాంధీ కోరితే నేను ఏ క్షణమైనా పదవి నుంచి తప్పుకుంటాను” అని సిద్ధరామయ్య గతంలో పలుమార్లు చెప్పిన మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు.

కర్ణాటకలో ఈ అధికార మార్పిడి ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కె.సి. వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలా ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి, కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు, సిద్ధరామయ్య రాజీనామా చేసినప్పటికీ, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చు. డీకే శివకుమార్ వర్గం ఇప్పటికే సంబరాలకు సిద్ధమవుతుండగా, సిద్ధరామయ్య మద్దతుదారులు మాత్రం కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాలతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నేటి మధ్యాహ్నానికి నాయకత్వ మార్పుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us