AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: ఎండలు, అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అల్లకల్లోలం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే

ఉత్తర తమిళనాడు ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దక్షిణ తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలు జిల్లాల్లో 45 నుంచి 46 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు మాడుపగిలే ఎండలు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి..

Weather Report: ఎండలు, అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అల్లకల్లోలం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే
Andhra Pradesh Weather Today
Srilakshmi C
|

Updated on: May 28, 2026 | 7:10 AM

Share

అమరావతి, మే 28: రాష్ట్రంలో ఒకవైపు భగ్గుమంటున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, మరోవైపు పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దక్షిణ తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో గురువారం బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరంలో 41.6 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరంలో 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు వడదెబ్బ ప్రభావం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం వడదెబ్బకు గురై శ్రీకాకుళం జిల్లాలో పలాసపురానికి చెందిన సింహాచలం పాణిగ్రహి (68), రంగనాథపురానికి చెందిన నడిపూడి కృష్ణారావు (36) మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న వేళల్లో బయటకు రావద్దని, తగినంత నీరు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నారుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

తెలంగాణలో చల్లబడ్డ వాతావరణం.. నేటి వెదర్‌ ఎలా ఉంటుందంటే?

తెలంగాణలోనూ ద్వంద్వ వాతావరణం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఎండలు.. మరోవైపు అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి హైదరాబాద్‌ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిని భారీ వర్షం కురవడంతో వాతావరణం కాస్త చల్లబడింది. నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవడంతో రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బుధవారం కూడా వాతావరణం చల్లగా ఉండటంతో నగరవాసులు సేద తీరారు. ఇక ఈ రోజు కూడా ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us