Telangana Nominations: మంచి రోజు కావడంతో నామినేషన్‌కు క్యూకట్టిన నేతలు.. రేపే చివరి రోజు..
ఏకాదశి, మంచి రోజు కావడంతో తెలంగాణలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అంతే కాదు రేపు చివరి రోజు కావడంతో హడావుడి ఎలా ఉంటుందోననే భయంతో చాలా మంది అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు సమర్పించారు. పెనల్టిమేట్ డే కావడంతో వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రావడంతో రాష్ట్రంలోని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలన్నీ సందడిగా మారాయి. నామినేషన్ల సందర్భంగా నాయకులు ర్యాలీలు, ప్రదర్శనలు

ఏకాదశి, మంచి రోజు కావడంతో తెలంగాణలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అంతే కాదు రేపు చివరి రోజు కావడంతో హడావుడి ఎలా ఉంటుందోననే భయంతో చాలా మంది అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు సమర్పించారు. పెనల్టిమేట్ డే కావడంతో వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రావడంతో రాష్ట్రంలోని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలన్నీ సందడిగా మారాయి. నామినేషన్ల సందర్భంగా నాయకులు ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. మంచిర్యాలలో కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేశారు సీనియర్ నేత ప్రేమ్‌సాగర్ రావు. నామినేషన్ వేయడానికి ముందు ఆయన అమ్మవారికి పూజలు చేశారు. ఆ తర్వాత ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. బోధన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ నామినేషన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఆమె స్కూటర్ కూర్చొని ర్యాలీలో పాల్గొన్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిరలో నామినేషన్ దాఖలు చేశారు. వైరాలోని అయ్యప్పస్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అభిమానులు మంగళహారతులు పడుతుండగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలతో మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలో నామినేషన్ దాఖలు చేశారు. కోలాటాలు వేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. సనత్‌నగర్ స్థానం మరోసారి పోటీ చేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తల్లి లలిత ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ దాఖలు చేశారు.
పటాన్‌చెరు నుంచి బీఆర్ఎస్ తరపున మరోసారి పోటీ చేస్తున్న గూడెం మహిపాల్ రెడ్డి గణేశ్ గడ్డ వినాయకుడి గుడిలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ సమర్పించారు. భారీ ర్యాలీగా ఆయన రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. ఎల్బీ నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మంచిరోజు కావడంతో నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి ఆయన కర్మాన్‌ఘాట్ హనుమాన్ ఆలయాన్ని, కొత్తపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం, దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయాలు సందర్శించి పూజలు చేశారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన అభిమానులు ర్యాలీ తీశారు. అంబర్‌పేట నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి కృష్ణ యాదవ్ నామినేషన్ సందర్భంగా నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. నల్లకుంటలోని పాత రామాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ సందర్భంగా కృష్ణ యాదవ్ వెంట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఉన్నారు. ఆర్మూర్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఖైరతాబాద్ జీహెచ్ఎంజీ జోనల్ కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఆమె ఖైరతాబాద్ చౌరస్తాలోని తన విగ్రహానికి పూలమాల వేశారు.
చెన్నూరు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న వివేక్ వెంకటస్వామి, బీఆర్ఎస్ తరుపన పోటీ చేస్తున్న బాల్క సుమన్ నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరు నాయకులు అక్కడి దేవాలయాల్లో పూజలు చేసి రిటర్నింగ్ అధికారి కార్యలయానికి వచ్చారు. కూకట్‌పల్లి నుంచి జనసేన తరపున బరిలోకి దిగుతున్న ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ బీజేపీ శ్రేణులతో ర్యాలీగా వచ్చి నామినేషన్ సమర్పించారు. ఉప్పల్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న బండారి లక్ష్మారెడ్డి నామినేషన్ సమర్పించారు. ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చిన లక్ష్మారెడ్డి వెంట ప్రస్తుత ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ వచ్చారు. టికెట్ కన్పామ్ కాని వారు కూడా మంచి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేశారు. ఇలా చేసిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదరరెడ్డి ఉన్నారు. సూర్యాపేట నుంచి ఆయన నామినేషన్ సమర్పించారు. కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని గట్టి నమ్మకంతో ఆయన ఉన్నారు. పార్టీలో ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డి కూడా నామినేషన్ సమర్పించారు.
మరిన్ని తెలంగాణ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..