Telangana: కరకగూడెం నరమేధానికి 29 ఏళ్లు.. ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే..?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కరకగూడెం గ్రామం గాఢ నిద్రలో ఉంది. ఆ నిశ్శబ్దాన్ని బద్దలకొడుతూ ఒక్కసారిగా పేలుళ్ల శబ్దాలు, తుపాకుల మోతలు ఆ ప్రాంతాన్ని వణికించాయి. వందలాది మంది నక్సల్స్ మెరుపు దాడితో పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. బాంబులతో స్టేషన్‌ను పేల్చివేసి, ఏకంగా 16 మంది పోలీసుల ప్రాణాలను బలిగొన్న ఆ రక్తాక్షరాల ఘటన జరిగి నేటికి సరిగ్గా 29 ఏళ్లు.

జనవరి 10 1997.. ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లాను ఉలిక్కిపడేలా చేసింది ఓ ఘటన. తెల్లవారేసరికి రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేసింది ఆ వార్త. జరిగి 29 సంవత్సరాలు గడుస్తున్న ఆ ఊరి ప్రజలకు ఆ ఘటన తాలూకు దృశ్యాలు ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయి. నక్సల్స్ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌పై మెరుపు దాడి చేసి..స్టేషన్‌ను పేల్చివేశారు..ఈ ఘటన లో 16 మంది పోలీసుల ప్రాణాలు తీయడమే కాక ఆయుధాలు ఎత్తుకెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో 29 ఏళ్ల క్రితం నక్సల్స్ చేసిన నరమేధం పోలీసు వర్గాలు ఇంకా మర్చిపోలేకపోతున్నాయి. జనవరి 10, 1997 అర్ధరాత్రి సాయిధులైన వందమంది నక్సల్స్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి 16 మంది పోలీసుల ప్రాణాలను బలిగొన్నారు. స్టేషన్‌లో ఉన్న ఆయుధాలను ఎత్తుకెళ్లడమే కాకుండా బాంబులతో పోలీస్ స్టేషన్‌ని పేల్చివేశారు. బాంబుల మోతలు, తుపాకీ శబ్దాలతో కరకగూడెం మార్మోగిపోయింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నక్సల్స్ చేసిన ఈ దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అప్పటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నక్సల్స్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులర్పించి ధ్వంసం అయిన పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. 16 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడంతో పోలీసు వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. పోలీసులు సంయమనం పాటించాలంటూ ముఖ్యమంత్రి, హోంమంత్రి విజ్ఞప్తి చేశారంటే నాటి ఆ ఘటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కరకగూడెం పోలీస్ స్టేషన్‌పై జరిగిన దాడికి నేటితో 29 ఏళ్లు. అయినా కూడా నాటి విధ్వంసాన్ని ఇంకా మర్చిపోలేక పోతున్నాం అని పోలీసులు అంటున్నారు. కరకగూడెం పోలీస్ స్టేషన్ ఘటన రెండేళ్ల పాటు ఆ ఊరికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. గ్రామస్తులు నక్సల్స్‌కు సహకరిస్తున్నారంటూ పోలీసులు, పోలీసులకు సమాచారం ఇస్తే చంపేస్తామంటూ అన్నలు ఇలా రెండు వర్గాల మధ్య గ్రామ ప్రజలు నలిగిపోయారు. నాటి ఘటన తర్వాత గ్రామంలోని యువత ఊరు విడిచి వెళ్లిపోయింది అంటే అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు, నక్సల్స్ సాగించిన ఈ నరమేదంతో కరకగూడెం పేరు రాష్ట్రస్థాయిలో మార్మోగిపోయింది. కరకగూడెం గురించి తెలియని పోలీస్ అధికారులు అంటూ ఉండరు. ఘటన జరిగి 29 ఏళ్లు గడుస్తున్న జనవరి 10 వ తారీకు వచ్చిందంటే ఆ విధ్వంసాన్ని గుర్తు చేసుకోకుండా ఆ ఊరి ప్రజలు ఉండలేరు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
