AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padma Award 2024 Winner: పాలమూరు బుర్రవీణ వాయిద్య కళాకారున్ని వరించిన పద్మశ్రీ.. అయనే చిట్టచివరి వారసుడు!

పాలమూరు పల్లె బుర్రవీణ వాయిద్య కళకు ఢిల్లీ గుర్తింపు లభించింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పను పద్మశ్రీ వరించింది. అంతరించిపోతున్న ప్రాచీన సంగీత వాయిద్యం బుర్రవీణ కళకు దాసరి కొండప్ప చివరి వారసుడు. రామాయణం, ఆధ్యాత్మిక, గ్రామీణ కథలను లయ బద్ధంగా పాడుతూ... తన బుర్రవీణ వాయిస్తూ కొండప్ప అబ్బురపరుస్తాడు. కొండప్ప గానం వింటే చిన్నా, పెద్దా తేడా లేకుండా..

Padma Award 2024 Winner: పాలమూరు బుర్రవీణ వాయిద్య కళాకారున్ని వరించిన పద్మశ్రీ.. అయనే చిట్టచివరి వారసుడు!
Burraveena Artist Dasari Kondappa
Boorugu Shiva Kumar
| Edited By: Srilakshmi C|

Updated on: Jan 26, 2024 | 12:24 PM

Share

పాలమూరు, జనవరి26: పాలమూరు పల్లె బుర్రవీణ వాయిద్య కళకు ఢిల్లీ గుర్తింపు లభించింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పను పద్మశ్రీ వరించింది. అంతరించిపోతున్న ప్రాచీన సంగీత వాయిద్యం బుర్రవీణ కళకు దాసరి కొండప్ప చివరి వారసుడు. రామాయణం, ఆధ్యాత్మిక, గ్రామీణ కథలను లయ బద్ధంగా పాడుతూ… తన బుర్రవీణ వాయిస్తూ కొండప్ప అబ్బురపరుస్తాడు. కొండప్ప గానం వింటే చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా మైమరిచిపోతారు.

కళను నమ్ముకొని జీవనం

దామరగిద్ద గ్రామానికి చెందిన ఒలియ దాసరి కుటుంబానికి చెందిన కొండప్ప జీవనం దుర్భరం. తాతల కాలం నాటి బుర్రవీణ కళను నమ్ముకున్న ఆయన కుటుంబానిది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. వంశపరంపర్యంగా వచ్చిన కళతో కథలు, పాటలు పాడుతూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబంలో రెండోవాడైన కొండప్ప తండ్రి, అన్నల నుంచి వారసత్వంగా బుర్రవీణ వాయిద్యంపై మంచి పట్టు సాధించాడు. తాతల కాలం నుంచే బుర్రవీణ వాయిద్యం వాయిస్తూ బిక్షాటన చేస్తూ కళనైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. అనంతరం కథలు, పాటలతో లయ బద్ధంగా బుర్రవీణ వాయిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రా, తెలంగాణతో పాటు కర్ణాటక ప్రాంతంలో తన కళను ప్రదర్శించి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా బుర్రవీణ కళను మాత్రం వదలలేదు కొండప్ప. దాసరి కొండప్ప ప్రాచీన సంగీత వాయిద్య కళను గుర్తించి 2022లో రాష్ట్రస్థాయి పురస్కారం అందజేసింది. గవర్నర్ తమిళీ సై సౌందర్ రాజన్ చేతుల మీదుగా కొండప్ప అవార్డు అందుకున్నారు. అలాగే బలగం సినిమాలో ‘అయ్యో శివుడా ఏమాయే ఎనకటి దానికి సరిపోయే’ పాటకు కొండప్ప తన గాత్రాన్ని అందించాడు. ఈ పాట సినిమాలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

కొండప్ప బుర్రవీణ వాయిద్యం ప్రత్యేకం

అంతరించే దశలో ఉన్న ప్రత్యేకమైన బుర్రవీణ వాయిద్యాన్ని వాయించే చివరి వయోద్యకరుడు దాసరి కొండప్ప. బుర్రవీణ ఎంతో విశిష్టమైన వాయిద్యం. ఎండిన ఎక్తర్ కాయ, కర్ర, మూడు తీగలతో కొండప్ప సొంతంగా తయారు చేసుకున్న వాయిద్యం. అనేక తంతి వాయిద్యాల సమ్మేళనం బుర్రవీణ. భూమి వీణ, గిరిజనుల విల్లాడి పద్యాలు, విల్లు తిగతో వాయించే వాయిద్యానికి సంబంధించినది. దాసరి కొండప్ప చిన్న, చిన్న జలదరింపు గంటలతో 24 రకాలుగా బుర్రవీణను వాయించగలడు. అంతరించిపోతున్న కళకు పద్మశ్రీ అవార్డుతో కేంద్రం ఇచ్చిన గుర్తింపు ఆ కళకు ప్రాణం పోసినట్టయ్యింది. దాసరి కొండప్ప అద్భుత కళానైపుణ్యానికి నాలుగో అత్యుత్తమ పురస్కారం లభించడంతో ఉమ్మడి పాలమూరు ప్రజలు, కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.