AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bird’s Nest Custody: విడాకులు తీసుకున్నా విడిపోని ‘గూడు’.. పిల్లల కోసం తల్లిదండ్రుల ‘నెస్టింగ్’ దారి!

విడాకులు అనేవి కేవలం ఇద్దరు వ్యక్తులు విడిపోవడం మాత్రమే కాదు, ఒక అందమైన గూడు ముక్కలవ్వడం. ఈ ప్రక్రియలో అత్యధికంగా నలిగిపోయేది అమాయకపు పిల్లలే. ఒక వారం తండ్రి దగ్గర, మరో వారం తల్లి దగ్గర.. బ్యాగులు సర్దుకుని రైలు పెట్టెల్లా తిరుగుతూ, తమకు ఇష్టమైన గదిని, స్నేహితులను, చదువును కోల్పోతుంటారు.

Bird’s Nest Custody: విడాకులు తీసుకున్నా విడిపోని ‘గూడు’.. పిల్లల కోసం తల్లిదండ్రుల ‘నెస్టింగ్’ దారి!
Nest Custody
Nikhil
|

Updated on: Mar 07, 2026 | 10:41 PM

Share

కానీ, ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి కూడా మారుతోంది. “మేము విడిపోయినా, మా పిల్లల ప్రపంచం విడిపోకూడదు” అనే సంకల్పంతో పుట్టుకొచ్చిన సరికొత్త కాన్సెప్టే నెస్టింగ్. సాధారణంగా విడాకులు అంటే పిల్లలు తమ మూటముల్లె సర్దుకుని తల్లి ఇల్లు లేదా తండ్రి ఇల్లు అంటూ తిరగాలి. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. పక్షులు తమ గూటిలో పిల్లలను ఉంచి, వంతుల వారీగా ఆహారం తెచ్చి పెట్టినట్టే.. ఇక్కడ ఇల్లు పిల్లలదే ఉంటుంది, కేవలం తల్లిదండ్రులు మాత్రమే వంతుల వారీగా వచ్చి వెళ్తుంటారు. దీనినే ‘బర్డ్స్ నెస్ట్ కస్టడీ’ అని పిలుస్తున్నారు. వినడానికి వినూత్నంగా ఉన్నా, ఇది పిల్లల మానసిక స్థితిని కాపాడటానికి ఒక అద్భుతమైన మార్గం. అయితే, భారతీయ సమాజంలో ఇది ఎంతవరకు సాధ్యం? దీని వెనుక ఉన్న సవాళ్లు ఏమిటి?

అసలేమిటీ ‘నెస్టింగ్’?

ఈ పద్ధతిలో పిల్లలు తమ సొంత ఇంట్లోనే, తమ పాత గదిలోనే ఉంటారు. వారి స్కూల్, స్నేహితులు ఏమీ మారవు. తల్లిదండ్రులు ఒక షెడ్యూల్ ప్రకారం ఆ ఇంటికి వస్తారు. ఉదాహరణకు, మూడు రోజులు తండ్రి ఆ ఇంట్లో ఉంటే, తల్లి వేరేచోట ఉంటుంది. ఆ తర్వాత తండ్రి వెళ్తాడు.. తల్లి వస్తుంది. దీనివల్ల పిల్లలకు తమ జీవితం తలకిందులు కాలేదనే భరోసా ఉంటుంది.

మన దేశంలో విడాకులు అంటే రెండు కుటుంబాల మధ్య యుద్ధం లాంటిది. ఇలాంటి పరిస్థితుల్లో ‘నెస్టింగ్’ సక్సెస్ అవ్వాలంటే మాజీ దంపతుల మధ్య విపరీతమైన నమ్మకం, పరస్పర గౌరవం ఉండాలి. ఒకరు వెళ్ళాక మరొకరు అదే ఇంట్లోకి రావడం అంటే వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సమస్యలు ఎదురవ్వచ్చు. పిల్లల కోసం ఒక ఇల్లు మెయింటైన్ చేస్తూ, తల్లిదండ్రులు విడివిడిగా ఉండటానికి మరో రెండు చోట్ల వసతి చూసుకోవాలి.

అంటే మొత్తం మూడు ఇళ్ల ఖర్చు భరించగల ఆర్థిక స్తోమత ఉండాలి. భారతీయ కోర్టులు పిల్లల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తాయి. అయితే ఆస్తి పంపకాల విషయంలో ఈ నెస్టింగ్ పద్ధతి భవిష్యత్తులో చిక్కులు తెచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విడాకుల గాయం నుంచి కోలుకోకముందే మళ్ళీ అదే పాత ఇంట్లోకి వెళ్ళడం, మాజీ భాగస్వామి వాడిన వస్తువులను చూడటం తల్లిదండ్రులకు మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. అయితే, తమకంటే పిల్లల భవిష్యత్తే ముఖ్యం అనుకునే మెచ్యూర్డ్ పేరెంట్స్ ఈ ప్రయోగాన్ని ధైర్యంగా చేస్తున్నారు. విడాకులు అనేవి ఒక బంధానికి ముగింపు కావొచ్చు.

కానీ, పేరెంటింగ్ అనేది ఒక నిరంతర ప్రయాణం. ‘నెస్టింగ్’ అనేది పిల్లల కోసం తల్లిదండ్రులు చేసే ఒక గొప్ప త్యాగం. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ సంప్రదాయ పద్ధతుల్లో పిల్లలు నలిగిపోకుండా చూడటానికి ఇదొక చక్కని ప్రత్యామ్నాయం. మరి మన దేశంలో ఈ పద్ధతి రాబోయే రోజుల్లో ఎంతవరకు ప్రాచుర్యం పొందుతుందో చూడాలి!

Follow Us