Onion Price: ఉల్లి రైతుల కన్నీరు.. నెల రోజుల్లోనే భారీగా పతనమైన ధరలు! కారణం ఇదే..
ఉల్లి రైతుకు మద్దతు కరువైంది. మర్కెట్‌లో ధర సగానికి పైగా పతనమైంది. లాభాలు ఆర్జించవచ్చని ఉల్లి పంట సాగు చేయగా.. పెట్టుబడి కూడా తిరిగివచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నెల రోజుల క్రితం మార్కెట్‌లో క్వింటాలు ఉల్లి ధర రూ.3 వేలు ఉండగా.. ప్రస్తుతం క్వింటాకు రూ.1200 నుంచి రూ.1400 వరకు మాత్రమే ధర పలుకుతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ డివిజన్‌లో ఉల్లిపంట..

మెదక్, ఫిబ్రవరి 6: ఉల్లి రైతుకు మద్దతు కరువైంది. మర్కెట్‌లో ధర సగానికి పైగా పతనమైంది. లాభాలు ఆర్జించవచ్చని ఉల్లి పంట సాగు చేయగా.. పెట్టుబడి కూడా తిరిగివచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నెల రోజుల క్రితం మార్కెట్‌లో క్వింటాలు ఉల్లి ధర రూ.3 వేలు ఉండగా.. ప్రస్తుతం క్వింటాకు రూ.1200 నుంచి రూ.1400 వరకు మాత్రమే ధర పలుకుతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ డివిజన్‌లో ఉల్లిపంట ఎక్కువగా సాగు చేస్తారు. ఎకరా విస్తీర్ణంలో ఉల్లి పంటను సాగు చేయడానికి రూ.60వేల నుంచి రూ. 70 వేల వరకు ఖర్చవుతుంది. గతేడాది ఎకరాకు 100 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ధర క్వింటాలుకు అత్యధికంగా రూ. 6వేల వరకు పలికింది. ఈసారి వాతావరణ మార్పుల కారణంగా దిగుబడి 70 నుంచి 80 క్వింటాళ్లకు మించడం లేదు.
మరోవైపు ధర కూడా భారీగా పతనమవుతున్నది. నెల క్రితం వరకు మార్కెట్‌లో ఉల్లిగడ్డ క్వింటాలుకు రూ. 3వేల వరకు పలికింది. కానీ క్రమంగా ధరలు పతనమవుతూ ప్రస్తుతం ధర క్వింటాలుకు రూ. 1200 నుంచి రూ. 1,400 మాత్రమే ధర పలుకుతున్నది.దీనితో ఉల్లి పంట వేసిన రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది.మరో వైపు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరకు ఉల్లి పంటను విక్రయిస్తే పెట్టుబడులకే సరిపోతుందని, తామెలా బతకాలని రైతులు వాపోతున్నారు.
పంట చేతికి వచ్చే సమయంలో ధరలు తగ్గిపోయాయని, ధర పెరిగే వరకు పంటను నిల్వ ఉంచడానికి సౌకర్యాలు లేవని రైతులు వాపోతున్నారు. స్థానికంగా ఉల్లిని నిల్వ ఉంచే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారులు కూడా తక్కువ ధర చెల్లిస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేసిన పంటను వెంటనే పక్క రాష్ట్రాలకు తరలించి విక్రయిస్తున్నారు. లాభాలు ఆర్జించవచ్చని ఉల్లిగడ్డను సాగు చేస్తే ఖర్చులకే సరిపోతున్నదని రైతులు ఉసూరుమంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




