Hyderabad: ఇల్లీగల్ గోడౌన్‌లపై DCA ఉక్కుపాదం.. రూ. 20.52 లక్షల విలువైన నకిలీ మందులు సీజ్
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) గురువారం (జనవరి 18) పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. అంబర్‌పేట్‌లో ఇల్లీగల్ గోడౌన్‌లపై గురు, శుక్రవారాల్లో దాడులు నిర్వహించగా దాదాపు రూ. 20.52 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులకు అక్రమంగా విక్రయించడానికి నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. అంబర్‌పేట్‌లోని ఆజాద్‌నగర్‌లోని అలీ కేఫ్‌కు సమీపంలో డ్రగ్ లైసెన్స్ లేకుండా..
హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) గురువారం (జనవరి 18) పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. అంబర్‌పేట్‌లో ఇల్లీగల్ గోడౌన్‌లపై గురు, శుక్రవారాల్లో దాడులు నిర్వహించగా దాదాపు రూ. 20.52 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులకు అక్రమంగా విక్రయించడానికి నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. అంబర్‌పేట్‌లోని ఆజాద్‌నగర్‌లోని అలీ కేఫ్‌కు సమీపంలో డ్రగ్ లైసెన్స్ లేకుండా ఎండీ. బషీర్ అహ్మద్ అనే వ్యక్తికి చెందిన గోడౌన్‌పై డీసీఏ డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు దాడి చేశారు. అక్కడ భారీ మొత్తంలో మందులు నిల్వచేసి ఉన్న కార్డ్‌బోర్డ్ షిప్పర్ కార్టన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
జనరేషన్ యాంటీబయాటిక్స్, పీడియాట్రిక్ సిరప్‌లు, యాంటీ అల్సర్ డ్రగ్స్, అనాల్జెసిక్ డ్రగ్స్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్‌లు, యాంటీమలేరియా డ్రగ్స్‌తో సహా మొత్తం నలభై రకాల మందులు దాడిలో లభ్యమయ్యాయి. గోడౌన్‌లో స్వాధీనం చేసుకున్న అనేక మెడిసిన్ ప్యాక్ లేబుల్లపై ‘యాష్లే ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరు ఉన్నట్లు డీసీఏ వెల్లడించింది. యాష్లే ఫార్మాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఖాస్రా నం. 24, ఫామ్ హౌస్ నం. 103, వసంత్ కుంజ్, న్యూఢిల్లీ-110070 అనే అడ్రస్ వాటిపై ఉన్నట్లు గుర్తించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని వివిధ తయారీదారుల వివరాలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. గోవా యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన ‘అమోక్సిసిలిన్ క్యాప్సూల్స్ ఐపీ 500 ఎమ్‌జీతో పాటు తెలంగాణ ప్రభుత్వ సరఫరా ఔషధాలు భారీ మొత్తంలో లభ్యమయ్యాయి. అలాగే మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని స్ట్రైడ్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన అజిత్రోమైసిన్ టాబ్లెట్స్ ఐపీ 500 ఎమ్‌జీ మందులను కూడా సీజ్ చేశారు.
దాడి సమయంలో గూడౌన్ ఎండీ మహ్మద్ బషీర్ అహ్మద్ మెడిసిన్ నిల్వలకు సంబంధించిన కొనుగోలు బిల్లులను అధికారులకు చూపించలేదు. ఎలాంటి సేల్ బిల్లులు లేకుండానే రాష్ట్రంలోని పలు మెడికల్ షాపులకు నకిలీ మందులను సరఫరా చేస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో గోడౌన్‌లో నిల్వ చేసిన మొత్తం మందులను DCA స్వాధీనం చేసుకున్నారు. కాగా గతకొంత కాలంగా నకిలీ మందుల అక్రమ విక్రయాలపై DCA పటిష్ట నిఘా ఉంచింది. ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేసే మందులు ఏ ఇతర సంస్థలు తయారు చేయవని, డ్రగ్స్ లైసెన్స్ లేకుండా ప్రభుత్వ సరఫరా మందులను నిల్వ ఉంచితే డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం ప్రకారం ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉన్నట్లు డీసీఏ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.